Nara Brahmani: ఇక్కడికి వస్తే సొంత ఊరు వచ్చిన భావన కలుగుతుంది: నారా బ్రాహ్మణి

Nara Brahmani visits Mangalagiri

  • మంగళగిరిలో పర్యటించిన నారా బ్రాహ్మణి
  • చేనేతల కోసం ఏర్పాటు చేసిన వీవర్ శాల ప్రారంభోత్సవానికి హాజరు
  • మంగళగిరి అంటే చేనేత చీరలే గుర్తొస్తాయన్న బ్రాహ్మణి 

టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ అర్ధాంగి, హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి నేడు మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. టాటా తనేరా సీఈవో అంబూజ నారాయణతో కలిసి ఆమె మంగళగిరిలో వీవర్ శాలను ప్రారంభించారు. 

ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడుతూ... మంగళగిరి చేనేత వస్త్రాలకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చేనేతలకు శిక్షణ, మార్కెటింగ్ కు టాటా గ్రూప్ ముందుకొచ్చిందని తెలిపారు. మంగళగిరి చేనేత కార్మికులకు అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తామని అన్నారు. 

మంగళగిరి పేరు చెబితే చేనేత చీరలు గుర్తొస్తాయని, ఇక్కడికి వస్తే సొంత ఊరు వచ్చిన భావన కలుగుతుందని బ్రాహ్మణి పేర్కొన్నారు. చేనేత కార్మికుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన వీవర్ శాలను ప్రారంభించిన నారా బ్రాహ్మణి, వీవర్ శాలలో ఏర్పాటు చేసిన అధునాతన మగ్గాలను, కుట్టు శిక్షణా కేంద్రాలను పరిశీలించారు. 

చేనేత వృత్తికి గుర్తింపు వచ్చేలా ప్రణాళికలు రూపొందించేందుకు తన వంతు కృషి చేస్తానని, నేత కార్మికులు రెట్టింపు ఆదాయం పొందేందుకు సహకరిస్తామని బ్రాహ్మణి తెలిపారు. 

టీడీపీ ఎన్ ఆర్ ఐ విభాగం, చేనేత ప్రముఖులు, రోటరీ క్లబ్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ వీవర్ శాలలో అధునాతన మగ్గాలతో  సరికొత్త డిజైన్లతో వస్త్రాలను తయారుచేస్తారు. చేనేతలకు టెక్నాలజీ వినియోగంలో సహకరించేందుకు, వారు నేసిన చీరలను కొనుగోలు చేసేందుకు టాటా గ్రూపుకు చెందిన తనేరా ముందుకొచ్చింది. 

మంగళగిరి చేనేతకు అంతర్జాతీయ గుర్తింపు పొందేలా సహకరిస్తామని టాటా తనేరా సంస్థ సీఈవో అంబూజ నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో  టాటా గ్రూప్ కు చెందిన రమణారెడ్డి, శాలిని, పాల్,  ఎన్ ఆర్ ఐ టీడీపీ విభాగం అధ్యక్షుడు వేమూరి రవికుమార్, బుచ్చిరాం ప్రసాద్, మంగళగిరి టీడీపీ ఇన్చార్జి నందం అబద్ధయ్య సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Nara Brahmani
Weavershala
Mangalagiri
Nara Lokesh
TDP
  • Loading...

More Telugu News