Sarfaraz Khan: టీమిండియా డెబ్యూ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తండ్రికి 'థార్' ఆఫర్ చేసిన ఆనంద్ మహీంద్రా

Anand Mahindra offers Thar for Team India debut cricketer Sarfaraz Khan

  • ఇంగ్లండ్ తో మూడో టెస్టుకు టీమిండియా జట్టులో సర్ఫరాజ్ ఖాన్
  • టీమిండియాకు ఆడాలన్న తన కల నెరవేర్చుకున్న సర్ఫరాజ్
  • తండ్రి నౌషాద్ ఖాన్ శిక్షణలో రాటుదేలిన ముంబయి బ్యాటర్
  • సర్ఫరాజ్ బ్యాటింగ్ పట్ల ముగ్ధుడైన ఆనంద్ మహీంద్రా

టీమిండియాకు ఆడాలన్న తన కలను నెరవేర్చుకోవడానికి ముంబయి క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ ఎంత సుదీర్ఘకాలం వేచి చూశాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రంజీల్లో టన్నుల కొద్దీ పరుగులు సాధించిన ఈ డాషింగ్ బ్యాట్స్ మన్ కు బీసీసీఐ సెలెక్టర్లు ఎట్టకేలకు టీమిండియా చాన్స్ ఇచ్చారు. 

ఇంగ్లండ్ తో మూడో టెస్టుకు టీమిండియా తుది జట్టులో స్థానం సంపాదించుకున్న ఈ యువ బ్యాటర్ వచ్చీ రావడంతోనే అర్ధసెంచరీ బాది తానేంటో నిరూపించుకున్నాడు. రనౌట్ కాకుండా ఉంటే కెరీర్ తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లోనే సెంచరీ సాధించి ఉండేవాడేమో! సెంచరీ సాధించకపోయినా అతడి బ్యాటింగ్ తీరు, అతడి దృక్పథం క్రికెట్ అభిమానులను అలరించాయి.

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సైతం సర్ఫరాజ్ ప్రదర్శన పట్ల ముగ్ధుడయ్యారు. సర్ఫరాజ్ ఖాన్ ను ఓ క్రికెటర్ గా తండ్రి నౌషాద్ ఖాన్ తీర్చిదిద్దిన తీరును మహీంద్రా అభినందించారు. ఆయన ఎక్స్ లో దీనిపై స్పందించారు. 

"అవకాశాలు రాలేదని సహనం కోల్పోవద్దు... ధైర్యంగా ఉండండి... అంతే! కఠోర శ్రమ, తెగువ, ఓర్పు... ఇవే విజయానికి దారులు. పిల్లల్లో స్ఫూర్తిని కలిగించేందుకు ఇంతకంటే మెరుగైన లక్షణాలు ఇంకేం ఉంటాయి? తన పిల్లలకు ఓ స్ఫూర్తిదాయక తండ్రిగా ఉన్న నౌషాద్ ఖాన్ కు థార్ వాహనాన్ని కానుకగా ఇద్దామని అనుకుంటున్నాను. మా నజరానా అందుకునేందుకు నౌషాద్ ఖాన్ అంగీకరిస్తే అందుకు ఎంతో సంతోషిస్తాం... మాకు దక్కిన గౌరవంగా భావిస్తాం" అని ఆనంద్ మహీంద్రా వివరించారు. 

నౌషాద్ ఖాన్ ముంబయిలో క్రికెట్ కోచ్. తండ్రి నౌషాద్ ఖాన్ శిక్షణలో బ్యాటింగ్ మెళకువలు నేర్చుకున్న సర్ఫరాజ్ ఖాన్ ప్రస్తుతం దేశవాళీ పోటీల్లో ప్రతిభావంతులైన బ్యాటర్లలో గుర్తింపు పొందాడు. అయితే, సెలెక్టర్లు అతడిని టీమిండియాకు ఎంపిక చేయడానికి చాలా సమయం తీసుకోవడం విమర్శలపాలైంది. 

అన్నట్టు... సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ కూడా క్రికెటరే. ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన అండర్-19 వరల్డ్ కప్ లో ముషీర్ ఖాన్ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. నిన్న రాజ్ కోట్ టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ అర్ధసెంచరీ సాధించిన అనంతరం ముషీర్ ఖాన్ సర్ ప్రైజ్ ఫోన్ కాల్ చేసి సోదరుడికి అభినందనలు తెలిపాడు.

  • Loading...

More Telugu News