Atchannaidu: రాజధాని ఫైల్స్ సినిమాపై అచ్చెన్నాయుడు స్పందన
- ఈ చిత్రం సందేశాత్మకమైన చిత్రమన్న అచ్చెన్న
- ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూడాలని పిలుపు
- సినిమాను చూసేలా ఇతరులను ప్రోత్సహించాలన్న అచ్చెన్న
రాజధాని ఫైల్స్ సినిమా ఒక సందేశాత్మకమైన సినిమా అని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రం బాగుండాలని కోరుకునే ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని చెప్పారు. ఈరోజు ఆయన ఈ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం సినిమాపై తన రివ్యూను ఇచ్చారు. సినిమా క్లైమాక్స్ ఈ సినిమాకు హైలైట్ అని చెప్పారు. గత ఐదేళ్లుగా జరుగుతున్న యథార్థ ఘటనలను, 1500 రోజులకు పైగా రాజధానీ కోసం అలుపెరగకుండా చేస్తున్న ఉద్యమాన్ని కేవలం 150 నిమిషాల వ్యవధిలో అద్భుతంగా చిత్రీకరించారని కొనియాడారు. సినిమాలోని ఏదో ఒక పాత్రలో మనల్ని మనం ఊహించుకుంటామని చెప్పారు. ఏపీ భవిష్యత్తుకు ఏదో చేయాలని అనుకునే వారంతా ఈ సినిమాను కచ్చితంగా చూడాలని అన్నారు. ఈ సినిమాను చూసేలా మరో పది మందిని ప్రోత్సహించాలని చెప్పారు.
రాజధాని ఫైల్స్ చిత్రం ముఖ్యమంత్రి జగన్ ను కించపరిచేలా ఉందని ఏపీ హైకోర్టులో వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలు లేవని హైకోర్టు తెలిపింది.