Revanth Reddy: సమగ్ర కుటుంబ సర్వేను బీఆర్ఎస్ బయటపెట్టలేదు: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy targets brs over samagra kutumba sarve

  • కులగణనపై సలహాలు, సూచనలు ఇవ్వకుండా అనుమానాలు వ్యక్తం చేయడం సరికాదన్న రేవంత్ రెడ్డి
  • బడుగు, బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని వ్యాఖ్య
  • సలహాలు, సూచనలు తీసుకోవడానికి కాంగ్రెస్‌కు ఎలాంటి భేషజాలు లేవన్న ముఖ్యమంత్రి

గత ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వేను బయటపెట్టలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. కుల గణన తీర్మానంపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ... కులగణనపై తీర్మానం కాదు... చట్టం చేయాలని విజ్ఞప్తి చేశారు. బీసీ కులగణన చేస్తే బీసీ కులాలే నష్టపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా కులగణన చట్టం చేయాలని సూచించారు. ఇది కేంద్రం పరిధిలోనిదని... రాష్ట్రం ఎలా చట్టం చేస్తుంది? అని ప్రశ్నించారు. అలాగే రిజర్వేషన్లు 50 శాతం మించితే ఏం చేస్తారో చెప్పాలన్నారు.

గంగుల కమలాకర్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. కులగణనపై సలహాలు, సూచనలు ఇవ్వకుండా అనుమానాలు వ్యక్తం చేయడం సరికాదన్నారు. చర్చను పక్కదారి పట్టించవద్దని సూచించారు. బడుగు, బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందన్నారు. మైనార్టీల స్థితిగతులపై అధ్యయనం చేసి రిజర్వేషన్ ఇచ్చినట్లు చెప్పారు. తమ అనుభవాలను క్రోడీకరించి తీర్మానం పెట్టామని తెలిపారు. అన్ని వర్గాలకు... అన్ని రకాలుగా అండగా ఉండాలనేది రాహుల్ గాంధీ ఆలోచన అని... ఆ ఆలోచనకు అనుగుణంగా తీర్మానం ఉందన్నారు.

శాస్త్రీయంగా ప్రణాళిక రూపొందించే క్రమంలో సర్వే ఉంటుందన్నారు. సలహాలు, సూచనలు తీసుకోవడానికి తమకు ఎలాంటి భేషజాలు లేవన్నారు. అసలు బీఆర్ఎస్ హయాంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వేను సభకు ఎప్పుడైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. పదేళ్లయినా ఆ నివేదికను రహస్యంగానే ఉంచారని ఆరోపించారు. నివేదికను ఒక కుటుంబం వద్ద పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ అవకాశాలకు ఇంటింటి సర్వే చేస్తామన్నారు. భేషజాలకు పోకుండా సూచనలు ఇవ్వాలని కోరారు. తీర్మానానికి చట్టబద్ధత లేదని చెప్పడం కాదని... అనుమానం ఉంటే సూచనలు ఇవ్వాలన్నారు.

Revanth Reddy
Congress
gangula kamalakar
BRS
  • Loading...

More Telugu News