Putin: అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ సరైనోడు: పుతిన్
- ట్రంప్ కన్నా అనుభవజ్ఞుడు, ఆలోచనాపరుడని వ్యాఖ్య
- అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనా సరే కలిసి పనిచేస్తామన్న రష్యా ప్రెసిడెంట్
- బైడెన్ ఆరోగ్యంపై మాట్లాడేందుకు తాను డాక్టర్ ను కానంటూ జవాబు
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ మరోసారి ఎంపికైతేనే అమెరికన్లకు మేలు జరుగుతుందని, ఆ పదవికి ఆయనే సరైన వ్యక్తి అని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ వ్యాఖ్యానించారు. మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో పోలిస్తే బైడెన్ అనుభవజ్ఞుడు, ఆలోచనాపరుడంటూ కితాబునిచ్చారు. వచ్చే నవంబర్ లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ గెలవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే, అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనా సరే అమెరికాతో కలిసి పనిచేస్తామని రష్యా ప్రెసిడెంట్ స్పష్టం చేశారు. ఈమేరకు బుధవారం ఓ ఇంటర్వ్యూలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
జో బైడెన్ వృద్ధాప్యం కారణంగా మతిమరుపు సహా పలు అరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన మానసిక ఆరోగ్యంపైనా పలువురు అమెరికన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారన్న ప్రశ్నకు పుతిన్ జవాబిస్తూ.. బైడెన్ ఆరోగ్యంపై మాట్లాడేందుకు తానేమీ డాక్టర్ ను కానని చెప్పారు. ప్రసంగిస్తున్నపుడు బైడెన్ చేతులు వణుకుతుంటాయనే ఆరోపణలను పుతిన్ కొట్టిపారేశారు. తనకూ అప్పుడప్పుడూ అలాగే జరుగుతుందని, అదేమీ పెద్ద విషయం కాదని తేల్చేశారు.
ఉక్రెయిన్ తో యుద్ధం గురించి..
ఉక్రెయిన్ తో జరుగుతున్న సుదీర్ఘ యుద్ధం గురించి పుతిన్ మాట్లాడుతూ.. ఈ విషయంలో ఇంకాస్త ముందుగా ప్రతిస్పందించాల్సి ఉండేదని, ఉక్రెయిన్ పై ముందుగానే దాడి చేయాల్సిందని రష్యా చింతిస్తోందని చెప్పారు. అమెరికా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల ట్రంప్ ఓ సభలో మాట్లాడుతూ.. నాటో కూటమి డిఫెన్స్ బడ్జెట్ పెంచకుంటే కూటమి దేశాలపై దాడి చేయాలని పుతిన్ ను రెచ్చగొడతానంటూ వ్యాఖ్యానించారు. దీనిపై పుతిన్ స్పందిస్తూ.. కూటమి దేశాలతో సంబంధాలను ఎలా మెరుగు పరుచుకోవాలనేది ట్రంప్ ఇష్టమని స్పష్టం చేశారు.