Volunteers: వాలంటీర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల విధులు అప్పగించవద్దు: ఈసీ

EC gives clarity on volunteers and secretariat staff role in upcoming general elections

  • ఏపీలో త్వరలో సాధారణ ఎన్నికలు
  • గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పాత్రపై క్లారిటీ ఇచ్చిన ఈసీ
  • సచివాలయ సిబ్బందికి ఓటర్ల వేలికి ఇంకు పూసే విధులు అప్పగించాలని సూచన
  • వాలంటీర్లను అభ్యర్థుల ఏజెంట్లుగా కూడా అనుమతించవద్దని స్పష్టీకరణ

ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పాత్రపై ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఓటర్ల వేలుకు ఇంకు పూసే విధులు మాత్రమే అప్పగించాలని ఈసీ పేర్కొంది. ఇతరత్రా ముఖ్యమైన పనులేవీ వారికి అప్పగించవద్దని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో)కి సూచించింది. 

ఎన్నికల విధుల కోసం గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని తీసుకునేందుకు అభ్యంతరం లేదంటూ సీఈవోకు లేఖ రాసింది. ప్రతి పోలింగ్ పార్టీలోనూ రెగ్యులర్ సచివాలయ సిబ్బందిని నియమించుకోవచ్చని తెలిపింది. 

బీఎల్వోలుగా పనిచేసిన సిబ్బందిని మాత్రం పోలింగ్ విధుల్లోకి తీసుకోవద్దని స్పష్టం చేసింది. బీఎల్వోలకు పోలింగ్ రోజున ఇతర పనులు అప్పగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని సీఈవోకు సూచించింది. 

ఇక, వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల ప్రక్రియలో భాగం చేయొద్దని ఈసీ తేల్చి చెప్పింది. వారికి ఎలాంటి ఎన్నికల విధులు కేటాయించవద్దని పేర్కొంది. అభ్యర్థులకు పోలింగ్ ఏజెంట్లుగా కూడా వాలంటీర్లను అనుమతించవద్దని మార్గదర్శకాలు జారీ చేసింది. 

ఈసీ లేఖ నేపథ్యంలో... గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఎన్నికల విధుల అప్పగింతకు అభ్యంతరం లేదంటూ కలెక్టర్లు, అధికారులకు సీఈవో సందేశం పంపారు. వారికి పోలింగ్ పార్టీలుగా సార్వత్రిక ఎన్నికల్లో విధులు అప్పగించవచ్చని సూచించారు. ఈసీ సూచన నేపథ్యంలో, సచివాలయ సిబ్బందికి ఎన్నికల్లో ప్రధాన విధులు మాత్రం అప్పగించవద్దని జిల్లా యంత్రాంగాలకు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News