GVL Narasimha Rao: హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంశంపై ఘాటుగా స్పందించిన జీవీఎల్

GVL reacts on Hyderabad joint capital issue

  • హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలన్న వైవీ సుబ్బారెడ్డి
  • ఏపీకి అమరావతే రాజధాని అని బీజేపీ చెబుతోందన్న జీవీఎల్
  • పక్క రాష్ట్రం నుంచి రాజధానిని తీసుకోవాల్సిన అగత్యం ఏపీకి లేదని వెల్లడి

హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా ఇంకొన్నాళ్లు కొనసాగించాలని వైసీపీ అగ్రనేత వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఏపీలో తీవ్ర రాజకీయ దుమారం రేగింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్ ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు. ఆ గడువు జూన్ తో ముగియనుంది.  

కాగా, నాటి టీడీపీ ప్రభుత్వం హైదరాబాద్ నుంచి వచ్చేసి అమరావతిని రాజధానిగా ప్రకటించింది. ఆ తర్వాత వైసీపీ సర్కారు హైదరాబాదులోని కార్యాలయాలన్నింటినీ తెలంగాణ సర్కారుకు అప్పగించింది. తదనంతరం, ఏపీకి మూడు రాజధానులు అంటూ ప్రకటించింది. ఇప్పుడు వైవీ వ్యాఖ్యలతో మరోసారి హైదరాబాద్ రాజధాని అంశం తెరపైకి వచ్చింది. 

దీనిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఘాటుగా స్పందించారు. ఏపీకి అమరావతే రాజధాని అని బీజేపీ చెబుతోందని స్పష్టం చేశారు. ఇప్పుడు ఆత్మనిర్భర్ ఆంధ్రప్రదేశ్ కావాలి అని పిలుపునిచ్చారు. వేరే రాష్ట్రం నుంచి రాజధానిని తీసుకోవాల్సిన అగత్యం ఏపీకి లేదని అన్నారు. 

హైదరాబాద్ ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఇస్తే దాన్ని ఉపయోగించుకున్న దాఖలాలు లేవు... మళ్లీ ఛలో హైదరాబాద్ అని ఎందుకంటున్నారని జీవీఎల్ విమర్శించారు. సొంత రాజధాని నిర్మించుకోలేకపోయిందన్న అప్రదిష్ఠ ఏపీకి ఎందుకు? మళ్లీ వెళ్లి పక్క రాష్ట్రంపై ఆధారపడతామనడం సబబేనా? అని ప్రశ్నించారు.

More Telugu News