ravindra naik: కేసీఆర్‌పై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?: సొంత పార్టీ తీరును తప్పుబట్టిన బీజేపీ నేత
- కేసీఆర్‌పై చర్యలు తీసుకోకపోవడం వల్ల బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేననే వాదన ఉందన్న రవీంద్ర నాయక్
- బీజేపీ ప్రజాప్రతినిధులు మేడిగడ్డ సందర్శనకు వెళ్లకపోవడాన్ని తప్పుబట్టిన రవీంద్ర నాయక్
- నల్గొండ టిక్కెట్ అడుగుతుంటే బీజేపీ నేతలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరని ఆగ్రహం
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు? అని తెలంగాణ బీజేపీ నేత రవీంద్ర నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వివిధ అంశాల్లో సొంత పార్టీ నేతల తీరును తప్పుబట్టారు. బీఆర్ఎస్ నేతలపై కేంద్రం చర్యలు తీసుకోకపోవడంతో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేననే వాదన ప్రజల్లోకి వెళుతోందన్నారు. నిన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాప్రతినిధులను మేడిగడ్డ సందర్శనకు తీసుకు వెళ్లిన సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు వెళ్లకపోవడాన్ని రవీంద్ర నాయక్ తప్పుబట్టారు.
ఆయన ఈ రోజు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. మేడిగడ్డకు వెళ్లకపోవడం వల్ల బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనన్న అభిప్రాయం ప్రజల్లో ఉందన్నారు. బీజేపీలో ఉన్న సీనియర్ లంబాడా నాయకుడిని తానేనన్నారు. తనకు లోక్ సభ ఎన్నికల్లో నల్గొండ టికెట్ ఇవ్వాలన్నారు. గతంలో తాను మంత్రిగా, ఎంపీగా పని చేసినట్లు చెప్పారు. అందుకే నల్గొండ టికెట్ అడుగుతున్నానని... కనీసం బీజేపీ నేతలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు.