Nara Lokesh: యాత్ర-2లో జగన్ నటిస్తే ఆ సినిమా హిట్టయ్యేదేమో!: నారా లోకేశ్

Nara Lokesh satires on YS Jagan over Yatra 2 movie

  • ఉమ్మడి విజయనగరం జిల్లాలో శంఖారావం యాత్ర
  • సాలూరు నియోజకవర్గంలో సభ
  • జగన్ కు సినిమా పిచ్చి ఎక్కువైందంటూ వ్యాఖ్యలు 

ఉమ్మడి విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శంఖారావం సభ నిర్వహించారు. ఈ సభలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

యాత్ర-2లో జగన్ నటిస్తే ఆ సినిమా కాస్త హిట్టయ్యేదేమో! అని వ్యంగ్యం ప్రదర్శించారు. ఈ మధ్య జగన్ కు సినిమా పిచ్చి ఎక్కువైందని, కానీ ఆ వంకర నవ్వుతో సినిమాల్లో చేయలేడని విమర్శించారు. అయితే తన రేంజి పెంచుకోవడానికి వ్యూహం, యాత్ర-2 సినిమాలు తీశారని లోకేశ్ వెల్లడించారు. 

"మొన్న వచ్చింది యాత్ర-2... అట్టర్ ఫ్లాప్ కన్నా దారుణమైన ఫ్లాప్ అయింది. సొంత పార్టీ వాళ్లే ఇంత దరిద్రగొట్టు సినిమాకు మేం వెళ్లం అంటున్నారు. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో నిర్మాత నష్టపోయాడు. జగన్ వద్దకు వెళితే నేనెందుకుం సాయం చేయాలన్నాడు. దాంతో ఆ నిర్మాత అంతిమయాత్ర సినిమా తీస్తానని హెచ్చరించడంతో జగన్ భయపడిపోయి హార్సిలీ హిల్స్ వద్ద రెండెకరాల ప్రభుత్వ భూమిని నిర్మాత పేరున రాయించేశాడు. 

జగన్ ను నేను అడుగుతున్నా... సినిమా తీసింది మీపై అయినప్పుడు నిర్మాతకు మీ సొంత ఇల్లు రాసిస్తే సరిపోయేది కదా...  ఇడుపులపాయలోని వందలాది ఎకరాల్లో రెండెకరాలు ఆ నిర్మాత పేరు మీద రాయొచ్చు కదా" అంటూ నారా లోకేశ్ వ్యాఖ్యానించారు.

ఆ మూడు కుటుంబాలకు జగన్  లైసెన్స్ ఇచ్చేశాడు

జగన్ మూడు కుటుంబాలకు లైసెన్స్ ఇచ్చేశాడు. ఒకటి బొత్స కుటుంబం, రెండోది వైవీ సుబ్బారెడ్డి కుటుంబం, మూడోది విజయసాయిరెడ్డి కుటుంబం. ఈ మూడు కుటుంబాలు ఉత్తరాంధ్రను సర్వనాశనం చేస్తున్నాయి. ఎక్కడ ప్రభుత్వ భూమి కనిపించినా, పేదల భూమి కనిపించినా కొట్టేస్తారు. ఈ మూడు కుటుంబాలకు చెందిన వారు చెరువులను కూడా కబ్జా చేస్తారు.  

అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఉక్కు ఫ్యాక్టరీని కొనుగోలు చేస్తుంది

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో విశాఖకు ఉక్కు పరిశ్రమను తీసుకువస్తే... ఈ జగన్ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఎవరూ అధైర్యపడవద్దు. మరో రెండు నెలలు ఓపిక పట్టండి. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కు పరిశ్రమను కొనుగోలు చేస్తుంది. ఈ మేరకు ఉత్తరాంధ్ర ప్రజలకు హామీ ఇస్తున్నా. 

విజయనగరం జిల్లాకు అనేక హామీలు ఇచ్చిన జగన్ ఒక్కటీ నిలబెట్టుకోలేదు. భోగాపురం ఎయిర్ పోర్టు పూర్తి చేస్తానన్నాడు... చేయలేదు. రామతీర్థం ప్రాజెక్టు పూర్తిచేస్తానన్నాడు... చేయలేదు. గోస్తనీ-చంపావతి నదులను అనుసంధానం చేస్తానన్నాడు... చేశాడా... లేదు. రామభద్రాపురం-పెద్దగడ్డ ప్రాజెక్టు పూర్తి చేస్తానన్నాడు... చేయలేదు. పాలేరు నదిపై డ్యామ్ ఏర్పాటు చేస్తానని మాటిచ్చి మాట తప్పాడు ఈ సైకో జగన్.

విజయనగరం జిల్లాను అభివృద్ధి చేసింది టీడీపీనే 

విజయనగరం జిల్లాను అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ఎక్కడ చూసినా నాడు టీడీపీ హయాంలో వేసిన రోడ్లు, బ్రిడ్జిలు, పక్కా గృహాలు కనిపిస్తాయి. 2014లో సాలూరులో టీడీపీ గెలవకపోయినా నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశాం. ఈ ప్రాంతాన్ని జాతీయ రహదారులకు అనుసంధానం చేశాం. 

రాజన్నదొర... ఇంకు లేని పెన్ను లాంటోడు!

రాజన్నదొరను ఇక్కడి ప్రజలు నాలుగుసార్లు గెలిపించారు. ఆయన ఇవాళ డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు. ఒక ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం అంటే ఎలా ఉండాలి...? చిటికేస్తే పనులు అయిపోవాలి! కానీ రాజన్నదొర ఇంకు లేని పెన్ను లాంటోడు. ఆయన పెన్ను అని నేను ఒప్పుకుంటా... కానీ ఇంకు చిన్న శ్రీను దగ్గర ఉంటుంది. ఆయన ఇంకు పోస్తేనే ఈయన పెన్ను రాస్తుంది. సాలూరు నియోజకవర్గం పరిస్థితి ఇలా ఉంటుంది. రాజన్నదొర ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నా ఇక్కడి ప్రజల జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా అని ప్రశ్నిస్తున్నా... అంటూ లోకేశ్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

More Telugu News