Rajasthan Police: ఆ గ్యాంగ్‌స్టర్ వివరాలు చెబితే 50 పైసల నజరానా!
- యోగేశ్ అనే నిందితుడిపై ఆయుధాల చట్టం కింద కేసు
- ఏడాదిగా పరారీలో నిందితుడు
- పట్టించినా, సమాచారం అందించినా 50 పైసల నజరానా ఇస్తామని రాజస్థాన్ పోలీసుల ప్రకటన
- రివార్డు వెనక కారణం చెప్పిన ఎస్పీ
పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న ఘరానా మోసగాళ్లనో, కరుడుగట్టిన నేరస్థులనో, గ్యాంగ్‌స్టర్లకు సంబంధించిన సమాచారం అందిస్తేనో, లేదంటే వారిని పట్టించిన వారికో వేలల్లో, లక్షల్లో పోలీసులు రివార్డులు ప్రకటించడం చూస్తూ ఉంటాం. కానీ, రాజస్థాన్ పోలీసుల ప్రకటన చూసిన ప్రతి ఒక్కరు నోరెళ్లబెడుతున్నారు. ఓ నేరస్థుడిని పట్టుకునే సమాచారం అందించిన వారికి అక్షరాలా యాభై పైసల నజరానా ప్రకటించారు.
ఆయుధాల చట్టం కింద నమోదైన కేసులో నిందితుడు యోగేశ్ ఏడాది కాలంగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్నాడు. అతడిని ఎలాగైనా పట్టుకుని కటకటాల వెనక్కి పంపాలన్న ఉద్దేశంతో జిల్లా ఎస్పీ దేవేంద్ర బిష్ణోయి రివార్డు ప్రకటించారు. యోగేశ్‌ను పట్టుకునే సమాచారం అందించిన వారికి 50 పైసలు ఇస్తామని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన ప్రకటించిన 50 పైసలు ప్రస్తుతం వాడుకలో కూడా లేకపోవడం గమనార్హం.
యోగేశ్ తలకు 50 పైసల రివార్డు ప్రకటించడం వెనకున్న కారణాన్ని కూడా ఎస్పీ వివరించారు. సమాజంలో ఒక నేరస్థుడి హోదా, విలువ 50 పైసలు మాత్రమేనని స్పష్టమైన సందేశం ఇచ్చేందుకు మాత్రమే 50 పైసల రివార్డు ప్రకటించినట్టు వివరించారు. నేరగాళ్ల తలపై వేలు, లక్షల రివార్డు ప్రకటిస్తే అది వారిని మరింత పాప్యులర్ అయ్యేలా చేస్తోందని ఎస్పీ తెలిపారు.