Revanth Reddy: మేడిగడ్డకు బస్సుల్లో బయల్దేరిన రేవంత్ అండ్ టీమ్.. బీఆర్ఎస్ పై రేవంత్, శ్రీధర్ బాబు ఫైర్

Revanth and team leaves to Medigadda

  • నాలుగు బస్సుల్లో మేడిగడ్డకు పయనం
  • కాళేశ్వరం అద్భుతమంటూ అమెరికాలో కూడా ప్రచారం చేశారని రేవంత్ మండిపాటు
  • మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక వచ్చిందన్న శ్రీధర్ బాబు

మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బయల్దేరారు. అసెంబ్లీ నుంచి నాలుగు బస్సుల్లో వీరు పయనమయ్యారు. సాయంత్రం 5 గంటలకు వీరు తిరిగి హైదరాబాద్ కు బయలుదేరుతారు. ఈ పర్యటనకు బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు దూరంగా ఉన్నారు.

అంతకు ముందు శాసనసభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇసుక కుంగడం వల్లే ప్రాజెక్టు కుంగిందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని విమర్శించారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఎన్నో లోపాలు ఉన్నాయని విజెలెన్స్ నివేదికను ఇచ్చిందని తెలిపారు. మేడిగడ్డను ఇసుకతో పేకమేడలా నిర్మించారా? అని ప్రశ్నించారు. రూ. 35 వేల కోట్ల అంచనాలతో ప్రారంభించిన ప్రాజెక్టును రూ. లక్షా 47 వేల కోట్లకు పెంచారని దుయ్యబట్టారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమంటూ అమెరికాలో కూడా ప్రచారం చేశారని రేవంత్ మండిపడ్డారు. తమ్మిడిహట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టును మరోచోట కట్టారని అన్నారు. ప్రాజెక్టుల వల్లే కరవు ప్రాంతాల్లో కూడా పంటలు పండించే అవకాశం వచ్చిందని చెప్పారు. ప్రజల ఆలోచనను దృష్టిలో ఉంచుకునే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభించారని అన్నారు. ప్రజలకు సందేశాన్ని ఇవ్వాల్సిన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ సభకు రాకుండా ఫామ్ హౌస్ లో దాక్కున్నారని ఎద్దేవా చేశారు. 

మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... మేడిగడ్డ ప్రాజెక్టు పరిశీలనకు రావాలని సభ్యులందరినీ కోరుతున్నామని చెప్పారు. మేడిగడ్డలోని వాస్తవాలను పరిశీలిద్దామని అన్నారు. మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక వచ్చిందని... గత ప్రభుత్వం ఇష్టానుసారం, అడ్డగోలుగా ప్రాజెక్టులను నిర్మించిందని దుయ్యబట్టారు. అన్ని పార్టీల ప్రతినిధులకు మేడిగడ్డను చూపించాలని నిర్ణయించామని చెప్పారు. తమకు న్యాయం చేయాలని భూనిర్వాసితులు ఇప్పటికీ కోరుతున్నారని తెలిపారు.

Revanth Reddy
Congress
Medigadda
Sridhar Babu
TS Politics
  • Loading...

More Telugu News