Virat Kohli: చివరి మూడు టెస్టులపై కోహ్లీ కీలక నిర్ణయం
- ఇంగ్లాండ్ తో సొంత గడ్డపై టెస్ట్ సిరీస్
- తొలి రెండు టెస్టులకు కూడా దూరంగా ఉన్న కోహ్లీ
- కోహ్లీ నిర్ణయాన్ని గౌరవిస్తామన్న జే షా
భారత క్రికెట్ అభిమానులకు ఇది తీవ్ర నిరాశను కలిగించే వార్త. ఇంగ్లాండ్ తో సొంత గడ్డపై జరుగుతున్న టెస్ట్ సిరీస్ చివరి మూడు టెస్టులకు స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ దూరంగా ఉంటున్నాడు. ఈ టెస్టులకు దూరంగా ఉండాలని కోహ్లీ నిర్ణయం తీసుకున్నాడు. కోహ్లీ నిర్ణయంపై బీసీసీఐ సెక్రటరీ జే షా స్పందిస్తూ.... కోహ్లీ నిర్ణయాన్ని బీసీసీఐ గౌరవిస్తుందని చెప్పారు. టెస్ట్ సిరీస్ లో జట్టులోని ఇతర ఆటగాళ్ల సామర్థ్యాలపై టీమ్ మేనేజ్ మెంట్ కు, బోర్డుకు నమ్మకం ఉందని తెలిపారు.
ప్రస్తుత టెస్ట్ సిరీస్ తొలి రెండు మ్యాచ్ లకు కూడా వ్యక్తిగత కారణాల వల్ల కోహ్లీ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. కోహ్లీ నుంచి క్లారిటీ రాకపోవడం వల్లే చివరి మూడు టెస్టులకు జట్టు ప్రకటన ఆలస్యమయింది. ఇప్పుడు కోహ్లీ తన నిర్ణయాన్ని తెలియజేయడంతో జట్టును ప్రకటించే అవకాశం ఉంది. జడేజా, కేఎల్ రాహుల్ ఫిట్ నెస్ కు సంబంధించి జాతీయ క్రికెట్ అకాడెమీ నుంచి నివేదికలు రావాల్సి ఉంది. గాయం బారిన పడిన శ్రేయస్ అయ్యర్ కి కూడా జట్టులో స్థానం దక్కకపోవచ్చు. సర్ఫరాజ్ ఖాన్ కు అవకాశం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.