Nara Lokesh: పీవీకి భారతరత్నపై స్పందించమంటే విజయసాయిరెడ్డిని అడగండన్న సీఎం జగన్... వీడియో పంచుకున్న నారా లోకేశ్

Nara Lokesh shares CM Jagan video

  • నేడు పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించిన కేంద్రం
  • సీఎం జగన్ ను స్పందన కోరిన జాతీయ మీడియా
  • "సాయిరెడ్డి విల్ ఆన్సర్ ఇట్" అంటూ కారెక్కి వెళ్లిపోయిన సీఎం జగన్
  • సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, నేడు ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్ ను పీవీకి భారతరత్నపై స్పందించాలని జాతీయ మీడియా కోరింది. 

"సార్... సార్... ఒక్క ప్రశ్న... పీవీ నరసింహారావు తెలుగు వ్యక్తి... ఆయనకు కేంద్రం భారతరత్న ప్రకటించింది... దీనిపై మీ కామెంట్?" అంటూ మీడియా ప్రతినిధులు సీఎం జగన్ ను అడిగారు. దూరం నుంచే నమస్కారం పెట్టుకుంటూ వస్తున్న సీఎం జగన్... "దీనికి విజయసాయిరెడ్డి సమాధానం చెబుతారు" అంటూ కారెక్కి వెళ్లిపోయారు. సీఎం జగన్ స్పందించిన తీరు వీడియో రూపంలో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 

దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ఇదేమి కుసంస్కారం జగన్? అంటూ మండిపడ్డారు. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, రాజనీతిజ్ఞుడు, మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావుకు భారతరత్న వంటి అత్యున్నత  పురస్కారం దక్కడం పట్ల తెలుగువారిగా మనమంతా గర్వపడాల్సిన సందర్భం అని లోకేశ్ పేర్కొన్నారు. 

కానీ, దీనిపై స్పందించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను జాతీయ మీడియా కోరితే ఆయన తప్పించుకున్న తీరు చాలా చాలా అవమానకరం అని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ వీడియోను కూడా లోకేశ్ తన ట్వీట్ లో పంచుకున్నారు.

Nara Lokesh
Jagan
Viral Videos
PV Narasimha Rao
Bharataratna
Vijayasai Reddy

More Telugu News