Yatra 2: త్వరలో యాత్ర-3 సినిమా ఉంటుంది: వైసీపీ ఎంపీ మార్గాని భరత్

Yatra 3 movie coming soon says Rajahmundry Margani Bharat

  • యాత్ర-2 సినిమాను వీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడిన రాజమండ్రి ఎంపీ
  • యాత్ర-2 మూవీ వంద శాతం విజయం సాధిస్తుందని ఆకాంక్షించిన వైసీపీ నేత
  • పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి రాజమండ్రిలో సినిమా చూసిన పార్టీ యువనేత

ఏపీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర-2’ సినిమా ప్రీమియర్ షోని ఎంపీ మార్గాని భరత్ రాజమండ్రిలో వీక్షించారు. యాత్ర-2 సినిమా ప్రజలు మెచ్చే సినిమా అని ప్రశంసించారు. ప్రజలను నమ్ముకుంటానంటూ జగన్ చెప్పిన మాట, ఆయన సవాళ్లను ఎదుర్కొంటూ ఏవిధంగా ముందుకొచ్చారనే అంశాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయని చెప్పారు. సినిమాను అందరం ఎంజాయ్ చేశామని, ఈ సినిమా వంద శాతం సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఆకాంక్షించారు.

 సీఎం జగన్ ప్రస్థానంపై త్వరలోనే యాత్ర-3 సినిమా కూడా  ఉంటుందని చెప్పారు. ఎంపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్, ఇతర స్థానిక నేతలు, కార్యకర్తలతో కలిసి రాజమండ్రిలో ‘యాత్ర-2’ సినిమాను చూశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాగా యాత్ర-2 ప్రీమియర్ షో సందర్భంగా రాజమండ్రిలోని రంభ, ఊర్వశి, మేనక థియేటర్ల వద్ద వైసీపీ అభిమానులు టపాసులు పేల్చారు. వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. 

సీఎం జగన్ పరదాలు కట్టుకొని తిరుగుతున్నారంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయని మీడియా ప్రస్తావించగా, మార్గాని భరత్ స్పందించారు. సీఎం జగన్ పరదాలు కట్టుకొని తిరుగుతున్నారా?.. ‘సిద్ధం’ సభలో అభిమానుల కేరింతలు కనిపించడంలేదా? అని ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. లక్షల మంది పాల్గొంటున్న ‘సిద్ధం’ సభల్లో సీఎం జగన్ ర్యాంప్ మీద నడుస్తున్నారని, పరదాలు కట్టుకొని తిరుగుతున్నారని ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు. జగన్ పట్ల ప్రజల్లో అశేష స్పందన కనిపిస్తోందని, ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరంలేదని ఆయన కొట్టిపారేశారు.

More Telugu News