Vyuham: 'వ్యూహం' సినిమాకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి... త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం: వర్మ
- రాజకీయ అంశాలతో వర్మ తెరకెక్కించిన చిత్రం 'వ్యూహం'
- ఈ చిత్రంపై కోర్టులను ఆశ్రయించిన నారా లోకేశ్, కాంగ్రెస్
- కోర్టు సూచనలతో 'వ్యూహం' చిత్రాన్ని మరోసారి పరిశీలించిన సెన్సార్ బోర్డు
- 'వ్యూహం' చిత్రం ఈ నెల 16న విడుదలయ్యే అవకాశం
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రాజకీయ అంశాలతో తెరకెక్కించిన చిత్రం 'వ్యూహం'. 'వ్యూహం' సినిమాపై టీడీపీ అగ్రనేత లోకేశ్, కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు న్యాయ వ్యవస్థను ఆశ్రయించడంతో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయడం కూడా వివాదాస్పదమైంది. అయితే కోర్టు సూచనలతో సెన్సార్ బోర్డు మరోసారి 'వ్యూహం' చిత్రాన్ని వీక్షించింది. ఆ చిత్రానికి రెండోసారి సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేసింది.
ఈ నేపథ్యంలో, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. "వ్యూహం సినిమాకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఈ విషయం చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తాం" అంటూ ట్వీట్ చేశారు. కాగా, వ్యూహం చిత్రాన్ని ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు తెలుస్తోంది.