Poonam Pandey: ఆరోగ్య మంత్రిత్వ శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా పూనమ్ పాండే.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం
- సర్వైకల్ క్యాన్సర్‌పై కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త ప్రచార కార్యక్రమం
- కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ పూనప్ పాండే అంటూ కథనం వైరల్
- ఇప్పటికే పూనమ్ పాండే టీం కేంద్రంతో చర్చిస్తోందంటూ కథనాలు
- ఈ వార్తలను కొట్టిపారేసిన కేంద్రం, పూనమ్ పేరును పరిశీలించట్లేదని స్పస్టీకరణ
సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమాలకు ప్రచారకర్తగా పూనమ్ పాండే పేరును కేంద్రం పరిశీలిస్తోందన్న వార్తలపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా స్పందించింది. పూనమ్ పాండే పేరు తమ పరిశీలనలో లేదని బుధవారం స్పష్టం చేసింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో పూనమ్ పాండే, ఆమె టీం చర్చలు జరుపుతోందన్న వార్తల నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు స్పష్టత ఇచ్చింది.
తను సర్వైకల్ క్యాన్సర్‌తో మరణించినట్టు ఇటీవల వదంతి సృష్టించిన పూనమ్ పాండే దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజే సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఆమె..తాను బతికే ఉన్నానని చెప్పుకొచ్చింది. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకే ఈ ప్రాంక్ ప్లే చేసినట్టు వివరించింది. ఈ చర్యతో బాధపడ్డ వారికి క్షమాపణలు కూడా చెప్పింది. పూర్తిగా నయమయ్యే ఈ క్యాన్సర్‌పై అవగాహన పెంపొందించడమే తన లక్ష్యమని పేర్కొంది.
అయితే, పూనమ్ అసాధారణ చర్యపై మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు ఆమె ధైర్యాన్ని మెచ్చుకొన్నారు. పబ్లిసిటీ కోసం దిగజారొద్దంటూ మరికొందరు దుయ్యబట్టారు. సున్నితమైన అంశాల విషయంలో హుందాగా వ్యవహరించాలంటూ హితవు పలికారు.