AP government: ఏపీ ప్రభుత్వం అసెంబ్లీకి సమర్పించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై టీడీపీ ఎమ్మెల్సీల విమర్శలు
- విలేకరుల సమావేశంలో మాట్లాడిన భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, కంచర్ల శ్రీకాంత్, వేపాడ చిరంజీవిరావు
- వైసీపీ ప్రభుత్వ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆత్మస్తుతి పరనిందలా ఉందని విమర్శలు
- ప్రజలకు, రాష్ట్రానికి ప్రభుత్వం అందించిన కొత్తదనం శూన్యమని ఆరోపణలు
- టీడీపీ ప్రభుత్వంలో వచ్చిన పరిశ్రమలు, కంపెనీలను సీఎం జగన్ తరిమేశారని ఆరోపణలు చేసిన ఎమ్మెల్సీలు
ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై టీడీపీ ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, కంచర్ల శ్రీకాంత్, వేపాడ చిరంజీవి రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు యువతకోసం ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలు మూసివేయించారని, నిరుద్యోగ భృతి తీసేసి రాష్ట్ర యువత నోట్లో సీఎం జగన్ మట్టి కొట్టారని కంచర్ల శ్రీకాంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ సర్కార్ ఉభయసభల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రసంగం ఆత్మస్తుతి పరనిందలా సాగిందని విమర్శించారు.
బడ్జెట్‌పై వైసీపీ నేతలే అసంతృప్తితో ఉన్నారని మరో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి అన్నారు. ‘‘వైసీపీ ప్రభుత్వంలో ఏ బడ్జెట్ చూసినా ఏమున్నది గర్వకారణం.. అవాస్తవాలు, అంకెల గారడీ.. అభూత కల్పనల మేళవింపు తప్ప’’ అని చిరంజీవి రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే, ప్రజలకు మేలుచేకూర్చే ఒక్క అంశం కూడా బడ్జెట్‌లో కనిపించలేదని ఆరోపించారు. జగన్ సర్కారు ఇన్నేళ్ల బడ్జెట్లలోనూ అలాంటి లక్షణాలు కానరలేదన్నారు. ముఖ్యమంత్రి సహా, వైసీపీ నేతల దోపిడీ సామర్థ్యం పెరిగిందని ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో సామర్థ్య ఆంధ్రా అనే ప్రస్తావన చేసిందా? అని చిరంజీవి రావు ప్రశ్నించారు. ఈ మేరకు మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో ముగ్గురు ఎమ్మెల్సీలు బుధవారం మీడియాతో మాట్లాడారు.
సభలో సీఎం చెప్పిన సూక్తుల్లో ఎన్నిపాటిస్తున్నారో : రామ్ గోపాల్ రెడ్డి
‘‘ సీఎం జగన్ రెడ్డి సర్కార్ నేడు అసెంబ్లీ, కౌన్సిల్లో బడ్డెట్ ప్రవేశపెట్టింది. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు సభలో చెప్పిన సూక్తుల్లో ఎన్ని పాటిస్తున్నాడో గుండెలపై చేయి వేసుకొని ముఖ్యమంత్రే ఆలోచించుకోవాలి. అన్నిరంగాల్లో రాష్ట్రం పురోగమిస్తోందని ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటు. వ్యవసాయరంగం మేలుకోసం .. రైతాంగం సంతోషం కోసం ఏం చేయబోతున్నారో బడ్జెట్లో ప్రభుత్వం పేర్కొనకపోవ డం నిజంగా బాధాకరం’’ అని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి అన్నారు. బడ్జెట్ ప్రసంగంలో కరవు మండలాల ప్రస్తావన, నష్టపోయిన రైతుల్నిఆదుకునే అంశాలు లేకపోవడంపై జగన్ రెడ్డి రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో, రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎలా పూర్తవుతుందో జగన్ ప్రభుత్వం బడ్జెట్ ప్రసంగంలో స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు. ఇళ్లనిర్మాణం, రోడ్ల నిర్మాణంపై ప్రభుత్వం చెప్పినవన్నీ అబద్ధాలేనని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులకు రూ.1200 కోట్లు బకాయిలు పెట్టడమేనా పేదల ఆరోగ్యాన్ని రక్షించడమంటే? అని రామ్ గోపాల్ రెడ్డి నిలదీశారు. వివేకానందుడి సూక్తి ప్రకారమే జగన్ రెడ్డికి ఓటేసిన ప్రజలు అష్టకష్టాలు, చెప్పుకోలేని బాధలు అనుభవిస్తున్నారని ఆరోపించారు.
టీడీపీప్రభుత్వంలో వచ్చిన పరిశ్రమలను తరిమికొట్టారు: కంచర్ల శ్రీకాంత్
టీడీపీప్రభుత్వంలో వచ్చిన పరిశ్రమలు, కంపెనీలను సీఎం జగన్ తరిమేశారని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. చివరకు చంద్రబాబు యువతకోసం ఏర్పాటుచేసిన స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలు మూసివేయించారని విమర్శించారు. నిరుద్యోగ భృతి తీసేసి రాష్ట్ర యువత నోట్లో సీఎం జగన్ మట్టి కొట్టారని మండిపడ్డారు. ‘‘ శాసనసభలో, శాసనమండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం అవాస్త వాలు, అంకెల గారడీకి ప్రతిరూపంగా నిలిచింది. యువతకు ఏ రకంగా ఉద్యోగావ కాశాలు కల్పించామో చెబుతూ ప్రభుత్వం దారుణంగా అబద్ధాలు చెప్పింది. జగన్ రెడ్డి.. అతని ప్రభుత్వం మాదిరి దేశంలో ఎవరూ అబద్ధాలు చెప్పలేరు. జగన్ రెడ్డి సర్కార్ ఐదేళ్లలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా కేవలం లక్షా 6 వేల మంది యువతకి మాత్రమే నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చింది. వారిలో ఎందరికి ఉద్యోగాలు ఇచ్చారంటే సమాధానం లేదు. కానీ టీడీపీప్రభుత్వం ఐదేళ్లలో 2.13లక్షల మందికి శిక్షణ అందించి, వారిలో 64వేల మందికి ఉపాధి కల్పించింది . సీమెన్స్ సంస్థతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో టీడీపీ ప్రభుత్వం స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఆ కేంద్రాలపై నిందలు వేసి, స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లోఅవినీతి జరిగిందంటూ జగన్ రెడ్డి సర్కార్ చంద్రబాబునాయుడిపై తప్పుడు కేసులు పెట్టింది. యువత భవితకు బంగారు బాటలు వేసే స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాల్ని నిరుపయోగంగా మార్చింది’’ అని కంచర్ల శ్రీకాంత్ అన్నారు.
ప్రత్యేకహోదా, ఉద్యోగాల కల్పన పేరుతో యువతను, నిరుద్యోగుల్ని వంచించిన జగన్ రెడ్డి వారి పాలిట ద్రోహి కాడా? అని ప్రశ్నించారు.
అవాస్తవాలు, అంకెల గారడీ.. అభూత కల్పనల మేళవింపు: వేపాడ చిరంజీవి రావు
వైసీపీప్రభుత్వంలో ఏ బడ్జెట్ చూసినా ఏమున్నది గర్వకారణం.. అవాస్తవాలు, అంకెల గారడీ.. అభూత కల్పనల మేళవింపు తప్ప అని టీడీపీ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు విమర్శలు గుప్పించారు. “ ఉభయసభల్లో ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. అది చూశాక నాకు శ్రీశ్రీ చెప్పింది గుర్తొచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో ఏ బడ్జెట్ చూసినా ఏమున్నది గర్వకారణం... అవాస్తవాలు, అంకెల గారడీ, అభూతకల్పనల మేళవింపు తప్ప అనిపించింది. రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే, ప్రజలకు మేలుచేసే ఒక్క అంశం కూడా జగన్ రెడ్డి సర్కార్ ఇన్నేళ్లలో ప్రవేశపెట్టిన బడ్జెట్లలో లేదు. విద్య, వైద్యం, ఉద్యోగ, వ్యవసాయం, పారిశ్రామికరంగం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంత దారుణంగా తయారైందో చూస్తూనేఉన్నాం. ప్రభుత్వం నేటి బడ్జెట్లో సామర్థ్య ఆంధ్రా అనే ప్రస్తావన చేసింది. ముఖ్యమంత్రి సహా, వైసీపీ నేతల దోపిడీసామర్థ్యం పెరిగిందని అలా చెప్పిందా?. విద్యారంగానికి సంబంధించి జగన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు అన్నీ అస్తవ్యస్తంగా, లోపభూయిష్టంగా ఉన్నాయి. నాడు-నేడు మొదటి దశ పనులే పూర్తి కాకుండా విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు ఎలా అందుతాయో ముఖ్యమంత్రి చెప్పాలి’’ అని చిరంజీవి రావు అన్నారు. ప్రొఫెసర్లు లేకుండా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు ఎలా పొందుతాయో జగన్ రెడ్డే చెప్పాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు నాయుడు 5 వేల మందికి విదేశీ విద్య పథకం ద్వారా ఆర్థికసాయం అందిస్తే, జగన్ రెడ్డి కేవలం 350 మందికి సాయంచేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ప్రభుత్వ.. వైసీపీనేతల వేధింపులు తట్టుకోలేక వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఆత్మహత్యలకు పాల్పడుతోంది నిజం కాదా? అని ప్రశ్నించారు.