Nara Bhuvaneswari: చంద్రబాబు నిజాయతీపరుడని జగనే నిరూపించారు: నారా భువనేశ్వరి

Nara Bhuvaneswari Nijam Gelavali Yatra

  • నిజం గెలవాలి పేరుతో భువనేశ్వరి యాత్ర
  • చంద్రబాబు అక్రమ అరెస్ట్ తట్టుకోలేక పార్టీ బిడ్డలు మృతి చెందారని ఆవేదన
  • మృతుల కుటుంబాలకు రూ. 3 లక్షల సాయం అందించిన వైనం

టీడీపీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' యాత్ర ఈరోజు ప్రత్తిపాడు, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో కొనసాగింది. చంద్రబాబు అక్రమ అరెస్ట్ తో మనస్తాపం చెంది, మృతి చెందిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. వారికి ఆర్థిక సాయం అందజేశారు. 

వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడులో జేష్టాటి కోటేశ్వరరావు కుటుంబాన్ని, వింజనంపాడు గ్రామంలో నార్నె విజయలక్ష్మి కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. చిలకలూరిపేట మండలం ఎడ్లపాడు గ్రామంలో మొగిలి సత్యనారాయణ కుటుంబాన్ని పరామర్శించి, ఓదార్చారు. ఒక్కో కుటుంబానికి రూ. 3 లక్షల చెక్కు ఇచ్చి, ఆర్థిక సాయాన్ని అందించారు. 

మరోవైపు ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ... చంద్రబాబు నిజాయతీపరుడని జగనే నిరూపించారని అన్నారు. 53 రోజుల పాటు చంద్రబాబును అక్రమంగా జైల్లో నిర్బంధించినా... తప్పు చేసినట్టు ఒక్క ఆధారాన్ని కూడా చూపలేకపోయారని విమర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురై పార్టీ బిడ్డలు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబాలను పరామర్శించడం, వారిని ఓదార్చడం తన కర్తవ్యమని చెప్పారు. ఎండను సైతం లెక్క చేయకుండా తనకు సంఘీభావం తెలిపేందుకు పెద్ద ఎత్తున కదలి వస్తున్న కార్యకర్తలు, మహిళలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.

More Telugu News