AP Budget: ఏపీ బడ్జెట్.. బోధనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్న మంత్రి బుగ్గన
- ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా విద్యార్థులకు శిక్షణ
- పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట
- డ్రాపౌట్ శాతం తగ్గించడానికి వివిధ పథకాల అమలు
రాష్ట్రంలో విద్యారంగాన్ని మెరుగుపరిచి ప్రపంచ స్థాయిలో మన విద్యార్థులు పోటీపడేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జగన్ సర్కారు పనిచేస్తోందని మంత్రి బుగ్గన పేర్కొన్నారు. ఓట్ ఆన్ బడ్జెట్ లో విద్యారంగానికి జరిపిన కేటాయింపులను అసెంబ్లీలో వెల్లడించారు. తమ ప్రభుత్వ హయాంలో విద్యారంగంలో వచ్చిన మార్పులను మంత్రి తన ప్రసంగంలో ప్రస్తావించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధన అమలు చేస్తున్నామని చెప్పారు. వెయ్యికి పైగా స్కూళ్లలో సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టినట్లు తెలిపారు. బోధనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, ఐబీ విధానం, వినూత్న పద్ధతులను అవలంబిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిచ్చామని వివరించారు.
పేదరికం కారణంగా విద్యార్థులు చదువుకు దూరంకాకూడదనే ఉద్దేశంతో జగనన్న విద్యా కానుక పథకాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి బుగ్గన వివరించారు. ఈ పథకంతో రాష్ట్రంలోని 47 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారని చెప్పారు. ఇందుకోసం రూ.3367 కోట్లు ఖర్చుచేశామని వివరించారు. మరో 34 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్ అందించేందుకు జగన్ ప్రభుత్వం సంకల్పించిందని చెప్పారు. జగనన్న విద్యాదీవెన పథకానికి రూ.11,901 కోట్లు, జగనన్న వసతి దీవెన పథకానికి రూ.4,267 కోట్లు వెచ్చించినట్లు మంత్రి తెలిపారు.
ఈ పథకాలతో 52 లక్షల మంది విద్యార్థులకు లబ్ది చేకూరిందన్నారు. స్కూళ్లలో గతంలో విద్యార్థుల డ్రాపౌట్ 20.37 శాతంగా ఉండగా.. తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు, తీసుకున్న చర్యలతో ఇది 6.62 శాతానికి తగ్గిందన్నారు. ఇక విదేశీ విద్యాదీవెన కింద ఇప్పటి వరకు 1,858 మంది విద్యార్థులు ప్రపంచంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నారని మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. చదువు పూర్తిచేసుకున్న విద్యార్థులకు తగిన ఉద్యోగం సాధించుకునేలా వర్చువల్ ల్యాబ్ లు ఏర్పాటు చేసి నైపుణ్య శిక్షణ అందించామని, దీంతో 95 శాతం మందికి ఉద్యోగాలు లభించాయని తెలిపారు.