Yatra-2: యాత్ర-2 సినిమా చూడకుండానే మాట్లాడితే ఎలా?: దర్శకుడు మహి వి రాఘవ్
- గతంలో వైఎస్సార్ జీవితం ఆధారంగా యాత్ర
- ఇప్పుడు యాత్రకు సీక్వెల్ గా యాత్ర-2
- ఫిబ్రవరి 8న రిలీజ్
- ప్రెస్ మీట్ నిర్వహించిన చిత్రబృందం
వైఎస్సార్, జగన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం యాత్ర-2. గతంలో వచ్చిన యాత్ర చిత్రానికి ఇది సీక్వెల్. ఇందులో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, తమిళ హీరో జీవా ప్రధాన పాత్రలు పోషించారు. మహి వి రాఘవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యాత్ర-2 చిత్రం ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఈ నేపథ్యంలో, చిత్రబృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. జగన్ పై అనేక కేసులున్నాయని, ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందని, అలాంటి నేతను గొప్పగా చూపించాల్సిన అవసరం ఏంటని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు.
అందుకు దర్శకుడు మహి వి రాఘవ్ స్పందిస్తూ... ఎవరినీ గొప్పగా చూపించడం అనేది ఉండదని అన్నారు.
"మీరింకా యాత్ర-2 సినిమాను చూడలేదు, అప్పుడే మాట్లాడితే ఎలా? నేనొక వెర్షన్ అనుకున్నాను... దాన్నే చూపిస్తున్నాను. ఇక కేసులంటారా... ఇప్పుడున్న అందరు నేతలపైనా కేసులున్నాయి. మొన్నటివరకు మనం ఒకరినే ఎత్తిచూపించాం... ఇప్పుడు మిగతావాళ్లపైనా కేసులు ఉన్నాయి. కథను కథగానే చూడాలి. మనం డప్పు కొట్టుకున్నామా అనే విషయం ఆడియన్స్ తేలుస్తారు.
ఇందులో ఎవరినీ టార్గెట్ చేయలేదు. ఆయన జీవితంలో కొన్ని పరిణామాలు జరిగాయి. కొందరిని ఎదిరించాడు, పార్టీలోంచి బయటికి వచ్చాడు, సొంత పార్టీ పెట్టుకున్నాడు... సినిమాలో వీటినే చూపించాం. అంతేతప్ప విలన్, హీరో అంటూ ఏమీ ఉండదు... పరిస్థితుల ఆధారంగా సన్నివేశాలు ఉంటాయి" అని వివరించారు.