NCP: శరద్ పవార్ వర్గానికి ఎదురుదెబ్బ... అజిత్ పవార్ వర్గానిదే అసలైన ఎన్సీపీ అంటూ ఈసీ తీర్పు

EC clarifies that NCP belongs to Ajit Pawar

  • శివసేన తరహాలోనే ఎన్సీపీలో చీలికలు
  • రెండు వర్గాలుగా శరద్ పవార్, అజిత్ పవార్
  • అజిత్ పవార్ కు అనుకూలంగా ఈసీ నిర్ణయం
  • గడియారం గుర్తు కూడా అజిత్ పవార్ వర్గానికే కేటాయింపు 

గతంలో శివసేన పార్టీలో ఎలాంటి వర్గ సంక్షోభం చెలరేగిందో, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లోనూ అలాంటి పరిస్థితులే తలెత్తాయి. శివసేన తరహాలోనే ఎన్సీపీలోనూ రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఒకటి ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ వర్గం కాగా, రెండోది ఆయన సోదరుడి కుమారుడు అజిత్ పవార్ వర్గం. ఎవరికి వారు తమదే అసలైన ఎన్సీపీ అని చెప్పుకుంటూ వచ్చారు. 

తాజాగా ఈ వివాదాన్ని ఎన్నికల సంఘం పరిష్కరించింది. అజిత్ పవార్ వర్గానిదే అసలైన ఎన్సీపీ అని తీర్పునిచ్చింది. అంతేకాదు, ఎన్సీపీ ఎన్నికల గుర్తు గడియారంను కూడా అజిత్ పవార్ వర్గానికే కేటాయించింది. 

అజిత్ పవార్ ప్రస్తుతం మహారాష్ట్ర శివసేన-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. త్వరలో లోక్ సభ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఎన్సీపీని అజిత్ పవార్ కు అప్పగిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయం శరద్ పవార్ వర్గం పాలిట దిగ్భ్రాంతికర పరిణామం అని చెప్పాలి. దీనిపై శరద్ పవార్ నుంచి ఇంకా స్పందన రాలేదు.

More Telugu News