Jharkhand: ఝార్ఖండ్ అసెంబ్లీలో హేమంత్ సోరెన్ భావోద్వేగ ప్రసంగం.. వీడియో ఇదిగో!

Jharkhand Former CM Hemanth Soren Emotional Speech In Assembly

  • తన అరెస్టు జరిగిన జనవరి 31 రాత్రి ఓ కాళరాత్రి అన్న మాజీ సీఎం
  • దేశ చరిత్రలో ఓ ముఖ్యమంత్రిని అరెస్టు చేయడం తొలిసారి అని వ్యాఖ్య
  • ప్రజాస్వామ్య చరిత్రలో అదొక చీకటి అధ్యాయమన్న హేమంత్

దేశ చరిత్రలో ఓ ముఖ్యమంత్రిని అరెస్టు చేసిన కాళరాత్రిగా జనవరి 31 మిగిలిపోతుందని ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పేర్కొన్నారు. ఝార్ఖండ్ అసెంబ్లీ సమావేశాలలో హేమంత్ సోరెన్ భావోద్వేగంతో ప్రసంగించారు. తీవ్ర ఆవేదనతో, ఒక్కో పదం కూడగట్టుకుంటూ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ సందర్భంగా కోర్టు ప్రత్యేక అనుమతితో హేమంత్ సోరెన్ సోమవారం ఉదయం అసెంబ్లీకి చేరుకున్నారు. ఈడీ అధికారులు, పోలీసుల ప్రత్యేక భద్రత మధ్య ఆయన అసెంబ్లీకి వచ్చారు.

రెండు రోజుల అసెంబ్లీ సమావేశాలలో తొలి రోజు సమావేశాలను ప్రారంభిస్తూ గవర్నర్ ప్రసంగించారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే హేమంత్ సోరెన్ మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓ ముఖ్యమంత్రిని అరెస్టు చేయడం బహుశా దేశంలోనే ఇదే మొదటిదని చెప్పారు. జనవరి 31 తేదీ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయమని పేర్కొన్నారు. ఈ ఘటనలో రాజ్ భవన్ పాత్ర కూడా ఉందని తాను నమ్ముతున్నట్లు సంచలన ఆరోపణలు చేశారు.

లాండ్ స్కామ్ లో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న హేమంత్ సోరెన్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు గత నెల 31 న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రి పదవికి హేమంత్ రాజీనామా చేశారు. అనంతరం ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) కూటమి శాసనసభా పక్షనేతగా చంపయి సోరెన్ ను ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఎమ్మెల్యేల మద్దతుతో చంపయి సోరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ క్రమంలో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని చంపయి సర్కారును ఆదేశించారు. సోమవారం అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ జరిపేందుకు అధికార పార్టీ కూటమి ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలోనే జైలు పాలైన హేమంత్ సోరెన్ ఫ్లోర్ టెస్టులో ఓటు హక్కును వినియోగించుకునేందుకు కోర్టును ఆశ్రయించారు. కోర్టు అనుమతినివ్వడంతో సోమవారం ఈడీ అధికారులు ఆయనను అసెంబ్లీకి తీసుకొచ్చారు.

More Telugu News