Medaram Jatara: మేడారం జాతర: 'బంగారం' కొనాలంటే ఆధార్ చూపించాల్సిందే..!
- జాతర సందర్భంగా బెల్లం అమ్మకాలపై ఎక్సైజ్ శాఖ ఆంక్షలు
- కొనుగోలుదారుల ఆధార్ జిరాక్స్, ఫోన్ నెంబర్ తీసుకోవాలని వ్యాపారులకు ఆర్డర్
- గుడుంబా తయారీ కట్టడికేనని అధికారుల వివరణ
మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర సందర్భంగా బంగారం (బెల్లం) అమ్మకాలకు సంబంధించి అధికారులు ఆంక్షలు పెట్టారు. బెల్లం కొనుగోలు చేసేవారి ఆధార్ జిరాక్స్ కాపీ, మొబైల్ నెంబర్ తీసుకోవాలని వ్యాపారులకు ఆదేశాలు జారీ చేశారు. మేడారంతో పాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జరిగే సమ్మక్క, సారలమ్మ జాతరలో అమ్మవార్లకు భక్తులు పెద్ద ఎత్తున బెల్లం సమర్పించుకుంటారు. నిలువెత్తు బెల్లం అమ్మవార్లకు ముడుపు చెల్లిస్తుంటారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా బెల్లం అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయి. రెండేళ్లకు ఒకసారి వచ్చే ఈ జాతర కోసం వ్యాపారులు పెద్ద మొత్తంలో బెల్లం స్టాక్ తెప్పించుకుంటారు.
ఈ ఏడాది జాతర సందర్భంగా బెల్లం అమ్మకాలపై ఎక్సైజ్ శాఖ ఆంక్షలు పెట్టడంతో అటు వ్యాపారులు, ఇటు భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఆధార్ తప్పనిసరి నిబంధనను తొలగించాలని కోరుతున్నారు. అయితే, గుడుంబా తయారీని కట్టడి చేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు. పెద్ద మొత్తంలో బెల్లం కొనుగోలు చేసి గుడుంబా తయారీకి వినియోగించే అవకాశం ఉందని అంటున్నారు.