Gulmarg: మంచు దుప్పటి అంటే ఇదేనేమో.. గుల్ మార్గ్ మొత్తం మంచు మయం.. డ్రోన్ వీడియో ఇదిగో!
- అడుగుల మేర కప్పేసిన మంచు
- గడిచిన 72 గంటలుగా ఇదే పరిస్థితి
- శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ లో పలు విమానాల రద్దు
దేశంలో ప్రముఖ పర్యాటక కేంద్రం కశ్మీర్ లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హిమపాతంతో గుల్ మార్గ్ ను మంచు దుప్పటి కప్పేసింది. గడిచిన 72 గంటలుగా ఇక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ లలోనే రికార్డవుతున్నాయి. అడుగులకొద్దీ పేరుకుపోయిన మంచుతో గుల్ మార్గ్ అంటార్కిటికాను తలపించేలా మారింది. వింటర్ లో స్కీయింగ్ కు గుల్ మార్గ్ పేరొందింది. ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ఈ సీజన్ లో గుల్ మార్గ్ చేరుకుంటారు. మూడు రోజులుగా మంచు కురుస్తూనే ఉండడంతో టూరిస్టులు ఎంజాయ్ చేస్తున్నారు. డ్రోన్ కెమెరాతో ఓ టూరిస్టు రికార్డు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మంచు పేరుకుపోయిన చెట్ల మధ్య మెలికలు తిరిగిన గీతలా రోడ్డు.. దానిపై ఒకటీ అరా కార్లు వెళుతున్న దృశ్యం చూపరులను ఆకట్టుకుంటోంది. ఓవైపు మంచు కురుస్తున్నా కొంతమంది టూరిస్టులు స్కీయింగ్ చేస్తుండడం వీడియోలో కనిపిస్తోంది. కాగా, శ్రీనగర్ లో హిమపాతం కారణంగా విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ ను అధికారులు తాత్కాలికంగా క్లోజ్ చేశారు. మంచు పేరుకుపోవడంతో శ్రీనగర్ - జమ్మూ హైవేపై ట్రక్కులు కిలోమీటర్ల కొద్దీ నిలిచిపోయాయి. సిటీలో రోడ్లపై పడుతున్న మంచును అధికారులు ఎప్పటికప్పుడు తొలగించే ఏర్పాట్లు చేశారు. వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. హిమపాతం కారణంగా అవలాంచీ (మంచుగడ్డలు దొర్లిపడడం) ముప్పు పొంచి ఉందని, కొండ ప్రాంతంలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.