England vs India: వైజాగ్ టెస్టు రసకందాయంగా మారిన వేళ ఆసియాలో ఇంగ్లండ్ ఛేదించిన అత్యధిక టెస్ట్ టార్గెట్ ఎంతంటే..!
- 2010లో బంగ్లాదేశ్‌పై అత్యధికంగా 209 పరుగులు ఛేదించిన ఇంగ్లండ్ టీమ్
- భారత్‌లో అత్యధికంగా 207 పరుగుల చేజింగ్
- ఆసియా పిచ్‌లపై ఒక్కసారి కూడా 300లకుపైగా టార్గెట్ సాధించలేకపోయిన పర్యాటక జట్టు
విశాఖపట్నం వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న 2వ టెస్టులో 399 పరుగుల లక్ష్యంతో పర్యాటక జట్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆదివారం బ్యాటింగ్ ఆరంభించింది. 67/1 వద్ద మూడవ రోజు ఆట ముగియడంతో చివరి రెండు రోజుల్లో ఇంగ్లండ్ ఇంకో 332 పరుగులు చేస్తే మ్యాచ్‌లో గెలుస్తుంది. బ్యాటర్లు చక్కటి ఫామ్‌లో ఉండడంతో ఈ భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ సాధిస్తుందా? లేక టీమిండియా జయకేతనం ఎగురవేస్తుందా? అనేది ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో ఆసియా పిచ్‌లపై ఇంగ్లండ్‌కు అత్యధిక పరుగుల ఛేజింగ్ ఎంత? 300 పరుగుల కంటే ఎక్కువ స్కోరును ఛేదించారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంగ్లండ్ టీమ్ ఆసియాలో టెస్ట్ ఫార్మాట్ క్రికెట్ మ్యాచ్‌ల్లో రెండో ఇన్నింగ్స్‌లో చేజింగ్ ద్వారా పలు మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. అయితే అత్యధిక పరుగుల చేజింగ్ మాత్రం 209 పరుగులుగా ఉంది. మార్చి 2010లో మిర్పూర్‌పై బంగ్లాదేశ్‌పై అలిస్టర్ కుక్ సేన ఈ విజయాన్ని సాధించింది. ఇక 1961లో లాహోర్‌లో పాకిస్తాన్‌పై 208 పరుగులు ఛేదించారు. 1972లో ఢిల్లీలో భారత్‌పై 207 పరుగుల టార్గెట్‌ను ఛేదించారు. 300లకుపైగా పరుగులను ఇంగ్లండ్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆసియా ఖండంలో ఛేదించలేదని ఈ గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది.
ఆసియాలో ఇంగ్లండ్ అత్యధిక ఛేదనలు ఇవే..
బంగ్లాదేశ్‌పై 209 పరుగులు (మిర్పూర్-2010)
పాకిస్థాన్‌పై 208 పరుగులు (లాహోర్- 1961)
భారత్‌పై 207 పరుగులు (న్యూఢిల్లీ -1972)
పాకిస్థాన్‌పై 176 పరుగులు (కరాచీ - 2000)
శ్రీలంకపై 171 పరుగులు (కొలంబో-1982).