Devineni Uma: వసంత కృష్ణప్రసాద్ టీడీపీలోకి వస్తారంటూ వార్తలు... సంచలన వ్యాఖ్యలు చేసిన దేవినేని ఉమా

Devineni Uma sensational comments

  • మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, లగడపాటిపై దేవినేని ఉమా ఫైర్
  • రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని విమర్శలు
  • మైలవరంలో రూ.100 కోట్లు వెదజల్లేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యలు
  • ఎవడ్ని కొంటావురా ఈ డబ్బుతో? అంటూ ఫైర్

టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలోకి వస్తున్నారన్న వార్తల నేపథ్యంలో దేవినేని ఉమా వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దేవినేని ఉమా  మైలవరం టికెట్ తనదేనని ఎప్పటినుంచో చెబుతున్నారు. ఈ క్రమంలో, ఆయన ఇవాళ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 

"25 ఏళ్లుగా పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ముందుకు నడిచాను. గతంలో టీడీపీలో ఉన్నవారు తలో పార్టీలో చేరి ఆస్తులు సంపాదించుకున్నారు. నాపై హత్యాయత్నాలు కూడా జరిగాయి. ఇవాళ బతికున్నానంటే అందుకు కారణం కార్యకర్తలే. మరో రెండ్రోజుల్లో మైలవరం నియోజకవర్గంలో అన్నేరావుపేట నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నా. 

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, వసంత కృష్ణప్రసాద్ మైలవరంలో రూ.100 కోట్లు ఖర్చు పెడతామని చెబుతున్నారు. ఈ దుర్మార్గులు తమకు మైలవరం టికెట్ కావాలంటూ పార్టీ దూకి రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు. రూ.100 కోట్లు తెచ్చి ఎవడ్ని కొంటావురా నువ్వు? ఎవడికి కావాలి నీ డబ్బులు? ఇలాంటి వాళ్లను తరిమి తరిమి కొట్టాలి. చావుకైనా నేను వెనుకాడను. కాకిలా బతికే కంటే హంసలా చచ్చేందుకైనా ఈ దేవినేని ఉమా సిద్ధం" అంటూ ఉమా నిప్పులు చెరిగారు. 

గుంటుపల్లి టౌన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో దేవినేని ఉమా ఈ వ్యాఖ్యలు చేశారు.

Devineni Uma
Vasantha Krishna Prasad
Lagadapati Rajagopal
Mylavaram
TDP
YSRCP
NTR District
  • Loading...

More Telugu News