Maldives: అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించారు... భారత్ ను సంజాయిషీ కోరిన మాల్దీవులు
- లక్షద్వీప్ విషయంలో భారత్, మాల్దీవుల మధ్య మాటల యుద్ధం
- ప్రభుత్వాల స్థాయిలో పెరిగిన అంతరం
- తాజాగా, భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది తమ పడవల్లో ప్రవేశించారంటున్న మాల్దీవులు
ఇప్పటికే టూరిజం అంశంలో భారత్, మాల్దీవుల మధ్య తీవ్ర అగాధం ఏర్పడింది. ప్రధాని మోదీ లక్షద్వీప్ కు ప్రచారం కల్పించే ఉద్దేశంతో ట్వీట్ చేయడం, మాల్దీవుల నేతలు ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయడంతో వ్యవహారం కాస్తా వివాదం రూపుదాల్చింది.
తాజాగా, భారత కోస్ట్ గార్డ్ దళానికి చెందిన సిబ్బంది తమ దేశానికి చెందిన మత్స్యకార బోట్లలో తనిఖీలు చేశారంటూ మాల్దీవుల ప్రభుత్వం మండిపడుతోంది.
"మా దేశానికి చెందిన మూడు ఫిషింగ్ బోట్లు మా ప్రాదేశిక సముద్ర జలాల పరిధిలో వేటాడుతున్నాయి. భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది మా పడవలపై అధికారం చెలాయించాల్సిన అవసరం ఏమొచ్చింది? భారత భద్రతా బలగాలు మా పడవలపై ఎందుకు కాలుమోపాల్సి వచ్చింది?" అంటూ మాల్దీవుల రక్షణ మంత్రిత్వ శాఖ భారత కేంద్ర ప్రభుత్వాన్ని సంజాయిషీ కోరింది.
"భారత కోస్ట్ గార్డ్ నౌకలు 246, 253కి చెందిన సిబ్బంది మా షిఫింగ్ బోట్లలోకి ప్రవేశించారు... ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే" అంటూ మాల్దీవుల ప్రభుత్వం పేర్కొంది.. కాగా, మాల్దీవుల ఆరోపణలపై భారత కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు.