K Kavitha: కవిత ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెబితే చాలు... మిగతా అన్నింటికి సమాధానం దొరుకుతుంది: మంత్రి కొండా సురేఖ
- కేసీఆర్ మనవడు ఏ హోదాలో భద్రాచల రాముడికి పట్టువస్త్రాలు తీసుకువెళ్లాడని ప్రశ్న
- కవిత ఎక్కడి నుంచి పోటీ చేసినా తెలంగాణ ప్రజలు ఓడిస్తారని వ్యాఖ్య
- అమెరికాలో అంట్లు తోముకునే వాళ్లు వచ్చి తెలంగాణలో దోచుకుతిన్నారని ఆరోపణ
కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నలు సంధించారని... కానీ ఆమె ఒక్క ప్రశ్నకు సమాధానం చెబితే మిగతా అన్నింటికి సమాధానం దొరుకుతుందని తెలంగాణ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఇంద్రవెల్లి సభకు ఖర్చుపైనా, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రకటిస్తామని కాంగ్రెస్ ప్రకటించడంపైనా కవిత విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలపై కొండా సురేఖ స్పందించారు. తాను కవితను ఒక ప్రశ్న అడగదలుచుకున్నానని... గతంలో భద్రాద్రి సీతారాములకు కేసిఆర్ మనవడు ఏ హోదాలో పట్టు వస్త్రాలు తీసుకెళ్ళాడు? అని నిలదీశారు. కేసీఆర్ సొంత డబ్బులతో వెళ్లారా? అని ప్రశ్నించారు. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెబితే వీటన్నింటికి తాము చెబుతామన్నారు.
కవిత ఎక్కడి నుంచి పోటీ చేసినా తెలంగాణ ప్రజలు ఓడిస్తారని వ్యాఖ్య
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్కడి నుంచి పోటీ చేసినా ప్రజలు ఓడించడం ఖాయమని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఇంద్రవెల్లి సభకు, సీఎం రేవంత్ రెడ్డి నిత్యం ఢిల్లీ వెళ్లడానికి అయిన ఖర్చులు ప్రభుత్వానివి కావా? అని కవిత అడగడం విడ్డూరమన్నారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. వందల కోట్ల రూపాయలు పెట్టి సొంత ఫ్లైట్ ఎలా కొనుగోలు చేశారో చెప్పాలన్నారు.
అమెరికాలో అంట్లు తోముకునే వాళ్లు వచ్చి తెలంగాణలో దోచుకుతిన్నారని ఆరోపణ
అమెరికాలో అంట్లు తోముకునే వాళ్లు వచ్చి ఈ రోజు తెలంగాణలో దోచుకొని తిన్నారని ఆరోపించారు. ప్రజల సొమ్ము దోచుకుతిన్న మీకు... మాట్లాడే హక్కు లేదన్నారు. లిక్కర్ స్కాంలో ఇరుక్కొని... లిక్కర్ రాణిగా మారారని కవితను ఉద్ధేశించి విమర్శించారు. బీజేపీ కాళ్లపై పడి అరెస్ట్ కాకుండా తప్పించుకున్నారన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసించారు కాబట్టే గెలిచామన్నారు. బీజేపీని, బీఆర్ఎస్‌ను తెలంగాణ వారు నమ్మలేదన్నారు. బీఆర్ఎస్ చేసిన మోసాలను ప్రజలు గుర్తించారన్నారు.
కవిత నిజామాబాద్ సహా ఎక్కడి నుండి ఎంపీగా పోటీ చేసినా ప్రజలు ఓడగొట్టి ఇంటికి పంపుతారని వ్యాఖ్యానించారు. తాము తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబుదారీగా ఉంటామని... బీఆర్ఎస్ నేతలకు మాత్రం కాదన్నారు. బీఆర్ఎస్ నాయకులు చిల్లర విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. మహాత్మా జ్యోతిరావు పూలే గురించి కవిత మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. బీఆర్ఎస్ పదేళ్లు పాలించినప్పుడు ఆయన గుర్తుకు రాలేదా? అని నిలదీశారు.