YSRCP: వైసీపీ ఆరో జాబితా విడుదల... వివరాలు ఇవిగో!
- నియోజకవర్గాల ఇన్చార్జిలను మార్చుతున్న వైసీపీ
- ఇప్పటివరకు 5 జాబితాలు విడుదల
- నేడు ఆరో జాబితా విడుదల చేసిన మంత్రి మేరుగ నాగార్జున, సజ్జల
ఏపీ అధికార పక్షం వైసీపీ నేడు నియోజకవర్గాల ఇన్చార్జిలకు సంబంధించిన ఆరో జాబితాను విడుదల చేసింది. ఇందులో 4 ఎంపీ స్థానాలు, 6 ఎమ్మెల్యే స్థానాలకు ఇన్చార్జిలను ప్రకటించారు. ఈ జాబితాను మంత్రి మేరుగ నాగార్జున, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విడుదల చేశారు.
ఎంతో ఆసక్తికరంగా మారిన నెల్లూరు సిటీ అసెంబ్లీ స్థానానికి కూడా ఈ జాబితాలో ఇన్చార్జిని ప్రకటించారు. నెల్లూరు సిటీ నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను నరసరావుపేట ఎంపీ స్థానానికి బదిలీ చేయగా, ఆయన స్థానంలో నెల్లూరు సిటీ ఇన్చార్జిగా డిప్యూటీ మేయర్ ఎండీ ఖలీల్ ను నియమించారు.
ఇక, గిద్దలూరు, మార్కాపురం ఎమ్మెల్యేలను పరస్పరం అటూ ఇటూ మార్చారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబును మార్కాపురం ఇన్చార్జిగా... మార్కాపురం ఎమ్మెల్యే కె.నాగార్జునరెడ్డిని గిద్దలూరు ఇన్చార్జిగా ప్రకటించారు.
అందరు అనుకున్నట్టుగానే ఎన్టీఆర్ జిల్లా మైలవరం స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు మొండిచేయి చూపారు. మైలవరం ఇన్చార్జిగా సర్నాల తిరుపతిరావు యాదవ్ ను నియమించారు. తిరుపతిరావు జడ్పీటీసీ అన్న సంగతి తెలిసిందే.
అదే సమయంలో... శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అరకు పార్లమెంటు నియోజకవర్గాలకు ప్రాంతీయ సమన్వయకర్తగా వైవీ సుబ్బారెడ్డిని నియమించారు. శ్రీకాకుళం, విజయనగరం పార్లమెంటు నియోజకవర్గాలకు డిప్యూటీ ప్రాంతీయ సమన్వయకర్తగా మజ్జి శ్రీనివాసరావును నియమించారు. సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా మజ్జి శ్రీనివాసరావు డిప్యూటీ ప్రాంతీయ సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు.