Kodi Kathi Case: రాజ్ భవన్ కు వచ్చిన కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడు... గవర్నర్ కు వినతిపత్రం అందజేత

Kodikathi Srinu mother and brother met AP Governor

  • కోడికత్తి కేసులో ఐదేళ్లుగా జైల్లోనే ఉన్న జనుపల్లి శ్రీను
  • సీఎం జగన్ సాక్ష్యం చెబితే తమ బిడ్డ  బయటికి వస్తాడంటున్న శ్రీను తల్లి
  • నేడు గవర్నర్ అబ్దుల్ నజీర్ కు వినతిపత్రం అందజేత
  • కోడికత్తి శ్రీను కుటుంబానికి అండగా దళిత, ప్రజా సంఘాలు
  • దేశ చరిత్రలో ఇలాంటి కేసు ఎక్కడా చూడలేదన్న వర్ల రామయ్య 

కోడికత్తి కేసులో గత ఐదేళ్లుగా జైల్లో ఉన్న నిందితుడు జనుపల్లి శ్రీను విడుదల కోసం అతడి కుటుంబ సభ్యులు పోరాటం చేస్తున్నారు. ఇవాళ కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడు విజయవాడలో రాజ్ భవన్ కు వచ్చారు. కోడికత్తి కేసులో తమకు న్యాయం చేయాలంటూ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు వినతిపత్రం అందజేశారు. 

అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసులో ముఖ్యమంత్రి జగన్ కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్పేలా చూడాలని గవర్నర్ ను కోరినట్టు వెల్లడించారు. ముఖ్యమంత్రి సాక్ష్యం చెబితే శ్రీను బయటికి వస్తాడని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. 

కోడికత్తి శ్రీను కుటుంబానికి దళిత సంఘాలు, ఇతర ప్రజా సంఘాలు అండగా నిలిచాయి. గవర్నర్ ను కలిసిన వారిలో సమతా సైనిక్ దళ్, అఖిలపక్ష నేతలు కూడా ఉన్నారు. 

కోడికత్తి కేసులో జగన్ సాక్ష్యం చెప్పకుండా జాప్యం చేస్తుండడంతో, శ్రీను జైల్లోనే మగ్గిపోతున్నాడని వారు గవర్నర్ కు వివరించారు. ఏపీలో దళితులపై అఘాయిత్యాలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయంటూ వివిధ ఘటనలను వారు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. 

దేశ చరిత్రలో ఇలాంటి కేసు ఎప్పుడూ చూడలేదు: వర్ల రామయ్య

కోడికత్తి కేసు వ్యవహారంపై రాజ్ భవన్ కు వచ్చిన వారిలో టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య కూడా ఉన్నారు.  ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశ చరిత్రలో ఇలాంటి కేసు ఎప్పుడూ చూడలేదని అన్నారు. జగన్ కుట్రపూరితంగానే శ్రీనును ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు.

Kodi Kathi Case
Srinu
Jagan
Governor
Raj Bhavan
Andhra Pradesh

More Telugu News