Crime News: అశ్లీల వీడియోలు చూస్తూ, స్కూల్‌లో అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని.. కొడుకుని చంపేసిన తండ్రి

Father kills son for watching obscene videos and teasing girls

  • మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఘటన
  • పద్ధతి మార్చుకోమని చెప్పినా పెడచెవిన పెట్టిన కుమారుడు
  • స్కూల్ నుంచి కూడా ఫిర్యాదులు అందడంతో హత్యకు ప్లాన్
  • కూల్‌డ్రింక్‌లో విషం కలిపి కుమారుడితో తాగించిన తండ్రి

మొబైల్ ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ స్కూల్‌లో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న 14 ఏళ్ల కుమారుడిని ఓ తండ్రి హత్యచేశాడు. మహారాష్ట్రలోని సోలాపూర్‌లో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు విజయ్ బట్టును తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. తమ కుమారుడు కనిపించడం లేదంటూ గత నెల 13న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కాసేపటికే కుర్రాడి మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం నివేదికలో విషం తీసుకోవడం వల్లే మరణించినట్టు తేలింది. 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. వారి సమాధానాలు పొంతన లేకుండా ఉండడంతో అనుమానించారు. కుర్రాడి తండ్రిని గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విశాల్ చదువును పక్కనపెట్టేసి ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ స్కూల్‌లో అమ్మాయిలను వేధించడం మొదలుపెట్టాడు. విషయం తెలిసిన తల్లిదండ్రులు పద్ధతి మార్చుకోమని చెప్పినా పెడచెవిన పెట్టాడు. మరోవైపు స్కూలు నుంచి కూడా ఫిర్యాదులు పెరిగాయి. 

కుమారుడి ప్రవర్తనపై విసిగిపోయిన తండ్రి జనవరి 13న తన 14 ఏళ్ల కుమారుడు విశాల్‌ను బైక్‌పై తుల్జాపూర్ రోడ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ కూల్‌డ్రింక్ కొని అందులో విషం కలిపి కుమారుడికి ఇచ్చాడు. విశాల్ అపస్మారక స్థితికి చేరుకున్నాక అతడు తిరిగి ఒంటరిగా ఇంటికి చేరుకున్నాడు. అదే రోజు సాయంత్రం భార్యాభర్తలు ఇద్దరూ స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన కుమారుడు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అసలు నిందితుడు తండ్రేనని తేలడంతో తాజాగా అతడిని కటకటాల వెనక్కి పంపారు.

More Telugu News