Budget-2024: బడ్జెట్ పై ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే...!

What Anand Mahindra opines on Budget

  • నేడు బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్
  • బడ్జెట్ సంతృప్తికరంగా ఉందన్న ఆనంద్ మహీంద్రా
  • విధాన ప్రకటనలు చేసేందుకు బడ్జెట్ ఒక్కటే సమయం కాదని వెల్లడి
  • సంవత్సరం పొడవునా అభివృద్ధి ప్రకటనలు చేయొచ్చని స్పష్టీకరణ 

నేడు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రముఖ వ్యాపారావేత్త ఆనంద్ మహీంద్రా ఆసక్తికరంగా స్పందించారు. 

అసలు... బడ్జెట్ అంటే ఏమిటి? బడ్జెట్ ను ఏ దృష్టితో చూడాలి? బడ్జెట్ తో ఉపయోగం ఏంటి? అనే అంశాలను ఆనంద్ మహీంద్రా తన పోస్టులో వివరించారు. 

"నేను చాలా కాలంగా చెబుతున్నాను... మనం బడ్జెట్ చుట్టూ ఎంతో డ్రామా సృష్టిస్తున్నాం. కేంద్రం చేసే విధానపరమైన ప్రకటన పట్ల అవాస్తవికతతో కూడిన అంచనాలను తీవ్రస్థాయికి పెంచేస్తుంటాం. అభివృద్ధి దిశగా చేసే విధానపరమైన ప్రకటనలకు బడ్జెట్ మాత్రమే సందర్భం కాదు... సంవత్సరంలో ఎప్పుడైనా పరివర్తనాత్మక విధాన ప్రకటనలు చేయొచ్చు. అయితే, మన ఆర్థిక అవసరాలను వివేకంతో, క్రమశిక్షణతో ఎలా ప్లాన్ చేసుకోవాలన్నదానికి బడ్జెట్ ఒక అవకాశం కల్పిస్తుంది. దృఢమైన, సుస్థిరమైన భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టడంపై మనం ఎంత ఎక్కువగా దృష్టి సారిస్తామో, ప్రపంచ పెట్టుబడిదారుల నుంచి అంత విశ్వాసాన్ని పొందుతాం" అంటూ ఆనంద్ మహీంద్రా వివరించారు.

ఇక ఇవాళ్టి బడ్జెట్ తనకు ఎందుకు సంతృప్తి కలిగించిందో కూడా ఆనంద్ మహీంద్రా తన సుదీర్ఘ పోస్టులో వివరించారు.

  • చాలా సంక్షిప్తంగా సాగిన ప్రసంగాల్లో నేటి బడ్జెట్ ప్రసంగం కూడా ఒకటి. క్లుప్తంగా ఉండే ఇలాంటి ప్రసంగాలు స్వాగతించదగినవి... ఎంతో ఆత్మవిశ్వాసంతో కూడుకున్నవి. 
  • ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ఎలాంటి ప్రజాకర్షక ప్రకటనల జోలికి వెళ్లలేదు. సాధారణంగా ఎన్నికల ముందు వచ్చే బడ్జెట్లు ఎలా ఉంటాయో మనకు తెలుసు. వాటికి భిన్నంగా నేటి బడ్జెట్ ఉంది. దీన్ని స్వాగతిస్తున్నా. అంతేకాదు, ఇకపైనా ఇదే ఒరవడి కొనసాగుతుందని ఆశిస్తున్నా.
  • ఆర్థిక లోటు లక్ష్యం అంచనా వేసిన దానికంటే మెరుగ్గానే ఉన్నట్టు భావించాలి. వివేకంతో కూడిన ఈ బడ్జెట్ ఆ దిశగా నిర్ణయాత్మక విజయాన్ని అందుకుంది.
  • భారీగా పన్నులు, సుంకాల్లో మార్పులు లేవు. వ్యాపారాలు ఎప్పుడూ కూడా స్థిరత్వానికి, అంచనాలకు విలువను ఇస్తాయి. అది ఈ బడ్జెట్ లో ప్రతిఫలించింది. 
  • ఇక శుభవార్త ఏంటంటే... జీడీపీ నిష్పత్తికి పన్ను ఎక్కువగా ఉండడం. ఆర్థిక వెసులుబాటుకు, దూకుడుగా వ్యయం చేయడానికి అవసరమైన పునాదిని సుస్థిరం చేస్తుంది. ఆర్థికమంత్రి ఈ అంశాన్ని మరింత ఘనంగా ప్రకటించుకోవచ్చు. 
  • సుసంపన్న భారత్ ను సాకారం చేసే క్రమంలో ఈ సంతృప్తికర బడ్జెట్ సాయంతో కీలక వారధిని దాటి ఇక మనం మన పనిపై దృష్టి పెట్టవచ్చు. మన ప్రణాళికలను సమర్థంగా అమలు చేసుకోవచ్చు.

  • Loading...

More Telugu News