Budget: బడ్జెట్ ప్రసంగంలో 'జీడీపీ'కి కొత్త అర్థం చెప్పిన నిర్మల
- రైతుల సంక్షేమానికి కృషి చేశామన్న కేంద్ర మంత్రి
- 11.8 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ సాయం
- దేశవ్యాప్తంగా 4 కోట్ల మంది రైతులకు ఫసల్ బీమా పథకం
దేశంలోని అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టి మంత్రి మాట్లాడారు. రైతుల సంక్షేమం కోసం వివిధ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. మద్దతు ధర, పెట్టుబడి సాయంతో ఆదుకున్నామని చెప్పారు. గత పదేళ్లలో 11.8 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. వ్యవసాయ రంగంలో సాంకేతికతను ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకున్నామని వివరించారు.
దేశవ్యాప్తంగా 4 కోట్ల మంది రైతులకు ఫసల్ బీమా యోజన కింద పంట బీమా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు పెంచడానికి వివిధ పథకాలు అమలు చేస్తున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. డెయిరీ రైతుల సమగ్రాభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. ఆయిల్ సీడ్స్ రంగంలో ఆత్మనిర్భరత సాధిస్తామని మంత్రి చెప్పారు. కాగా, జీడీపీ అంటే తమ ప్రభుత్వ దృష్టిలో గవర్నెన్స్, డెవలప్ మెంట్, ఫర్ఫార్మెన్స్ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త అర్థం చెప్పారు.