Vote On Budget: ఏపీకి ప్రత్యేక హోదా కోసం ‘వోట్ ఆన్ బడ్జెట్’ ను అడ్డుకోండి: జేడీ లక్ష్మీనారాయణ
- పార్లమెంట్ లో వార్షిక బడ్జెట్ ను అడ్డుకోవాలని చంద్రబాబు, జగన్ లకు సూచన
- ప్రత్యేక హోదా, విభజన హామీలపై చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్
- ‘ప్రత్యేక హోదా సాధన సమితి’ ఆధ్వర్యంలో విశాఖలో జైభారత్ పార్టీ నిరసన దీక్ష
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించుకునేందుకు ఓ గొప్ప అవకాశం వచ్చిందని జేడీ లక్ష్మీనారాయణ బుధవారం పేర్కొన్నారు. పార్లమెంట్ లో బడ్జెట్ సమావేశాల రూపంలో వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామని రాజకీయ నేతలకు ఆయన పిలుపునిచ్చారు. విభజన హామీలను నెరవేర్చాలని, ఏపీకి వెంటనే ప్రత్యేక హోదా ప్రకటించాలనే డిమాండ్ తో పార్లమెంట్ లో డిమాండ్ చేయాలని ఎంపీలను కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ‘వోట్ ఆన్ బడ్జెట్’ను అడ్డుకోవడం ద్వారా ప్రత్యేక హోదా సాధించుకోవచ్చని చెప్పారు.
వోట్ ఆన్ బడ్జెట్ పాస్ కాకుండా అడ్డుకుని పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబులను జేడీ లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ‘ప్రత్యేక హోదా సాధన సమితి’ ఆధ్వర్యంలో బుధవారం విశాఖపట్నం టూటౌన్ ఏరియాలోని గాంధీ విగ్రహం వద్ద జైభారత్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ ఒకరోజు నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మద్దతుగా నిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. విభజన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు.