NRI Yash: ఎన్నారై యశ్ కు ఏపీ హైకోర్టులో ఊరట
- సీఎంపై వ్యాఖ్యలు చేశాడంటూ యశ్ ను గత నెలలో అరెస్ట్ చేసిన సీఐడీ
- యశ్ విదేశాలకు వెళ్లకుండా లుకౌట్ సర్క్యులర్ జారీ
- హైకోర్టును ఆశ్రయించిన యశ్
ఎన్నారై టీడీపీ కార్యకర్త యశ్ బొద్దులూరికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. యశ్ పై సీఐడీ జారీ చేసిన లుకౌట్ సర్క్యులర్ ను హైకోర్టు రద్దు చేసింది. ఇవాళ విచారణ సందర్భంగా యశ్ తరఫున న్యాయవాది ఉమేశ్ చంద్ర వాదనలు వినిపించారు. ఇప్పటికే యశ్ కు 41ఏ నోటీసులు ఇచ్చారని తెలిపారు. యశ్ పై ఇంకా చార్జిషీట్ వేయలేదని కోర్టుకు వివరించారు. లుకౌట్ సర్క్యులర్ కొనసాగించడం ఆర్టికల్ 21కి విరుద్ధమని న్యాయవాది ఉమేశ్ చంద్ర స్పష్టం చేశారు. అరెస్ట్ చేసి నోటీసులు ఇచ్చాక లుకౌట్ సర్క్యులర్ కొనసాగించడం అర్థరహితమని పేర్కొన్నారు.
వాదనలు విన్న న్యాయస్థానం ఫిబ్రవరి 4న యశ్ అమెరికా వెళ్లేందుకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. లుకౌట్ సర్క్యులర్ రద్దు చేస్తున్నట్టు బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ కు ఏపీ హైకోర్టు ఉత్తర్వులు పంపింది. బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అనుమతి తర్వాత యశ్ అమెరికా వెళ్లొచ్చని స్పష్టం చేసింది.
ఎన్నారై టీడీపీ కార్యకర్త యశ్ గత నెలలో ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణలపై యశ్ ను అదుపులోకి తీసుకున్నారు.
అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని పరామర్శించేందుకు యశ్ అమెరికా నుంచి భారత్ రాగా... శంషాబాద్ ఎయిర్ పోర్టులో అతడిని అరెస్ట్ చేశారు. విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చి అతడ్ని విడుదల చేశారు. తదనంతరం అతడు విదేశాలకు వెళ్లకుండా లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. దాంతో, తనపై లుకౌట్ సర్క్యులర్ ఎత్తివేయాలని కోరుతూ యశ్ హైకోర్టును ఆశ్రయించారు