Ayyanna Patrudu: షర్మిలకు భద్రతను పెంచాలి: అయ్యన్న పాత్రుడు
- షర్మిలకు వైఎస్సార్ తన ఆస్తిలో వాటా రాశారన్న అయ్యన్న
- తనకు కూడా ప్రాణహాని ఉందని సంచలన వ్యాఖ్యలు
- వైసీపీకి ఉత్తరాంధ్ర ప్రజలు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్న
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ కు తల్లి, చెల్లి, బాబాయ్ అనే తేడా లేదని ఆయన అన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఆయన ఆస్తిలో షర్మిలకు వాటా రాశారని... ఆ వాటాను షర్మిలకు జగన్ ఇవ్వడం లేదని చెప్పారు. షర్మిలను అంతమొందించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని... ఆమెకు భద్రత పెంచాలని డిమాండ్ చేశారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తనకు కూడా జగన్ నుంచి ప్రాణహాని ఉందని... అందుకే తన రివాల్వర్ లైసెన్స్ ను రెన్యువల్ చేయాలని దరఖాస్తు చేశానని అయ్యన్న చెప్పారు. గన్ మెన్ ను పంపిస్తానని జిల్లా ఎస్సీ తనకు చెప్పారని... తాను వద్దని చెప్పానని తెలిపారు. తను ఎక్కడ ఉన్నానో గన్ మెన్లే సమాచారం ఇస్తారని చెప్పారు. తన కుమారుడు అనకాపల్లి స్థానానికి దరఖాస్తు చేశాడని... ఈ అంశాన్ని పార్టీ హైకమాండ్ పరిశీలిస్తోందని తెలిపారు.
నాలుగున్నరేళ్లలో ఉత్తరాంధ్రకు ఏం చేశారని విశాఖలో సిద్ధం సభను ఏర్పాటు చేశారని జగన్ ను అయ్యన్న ప్రశ్నించారు. ఇక్కడి ప్రజలు వైసీపీకి ఎందుకు ఓటు వేయాలని అడిగారు. ఉత్తరాంధ్ర భూములను దోచుకున్నందుకు మీకు ఓటు వేయాలా అని ప్రశ్నించారు. మూడు నెలల తర్వాత తమ ప్రభుత్వం వస్తుందని... అప్పుడు అందరి లెక్కలు తీస్తామని అన్నారు. ఎన్నికల తర్వాత జగన్ లండన్, అమెరికాలో దాక్కున్నా లాక్కొస్తామని... దోచుకున్న సొమ్మును కక్కిస్తామని హెచ్చరించారు. విశాఖ బీచ్ నుంచి భీమిలి వరకు ప్రభుత్వ భూములన్నింటినీ స్వాహా చేశారని ఆరోపించారు.