India: 2030 నాటికి 7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్: ఆర్థిక మంత్రిత్వ శాఖ
- వరుసగా మూడవ ఏడాది చక్కటి వృద్ధి సాధించామని పేర్కొన్న రిపోర్ట్
- ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆపసోపాలు పడుతున్న వేళ చక్కటి పురోగతి సాధించామని వెల్లడి
- మధ్యంతర బడ్జెట్‌కు ముందు ఎకానమీ రివ్యూ రిపోర్ట్ విడుదల చేసిన కేంద్ర ఆర్థిక శాఖ
భారతదేశ ఆర్థిక వ్యవస్థ 2030 నాటికి 7 ట్రిలియన్ డాలర్లకు వృద్ధి చెందుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మేరకు మధ్యంతర బడ్జెట్‌కు ముందు 'ఇండియన్ ఎకానమీ - ఏ రివ్యూ' పేరిట కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక రిపోర్ట్ విడుదల చేసింది. వరుసగా మూడవ ఏడాది భారత్ 7 శాతానికి పైగా వృద్ధి రేటును సాధించిందని పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 3 శాతానికి మించి వృద్ధిని సాధించడమే గగనంగా మారిన పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థ దృఢంగా పురోగమిస్తోందని పేర్కొంది.
స్థిరమైన ఆర్థిక వృద్ధికి భారత్ కట్టుబడి ఉందని ఆర్థికశాఖ పేర్కొంది. వాతావరణ మార్పులు, కర్బన ఉద్గారాల నియంత్రణకు అవసరమైన పెట్టుబడులను సమీకరిస్తున్నట్టుగా రిపోర్టులో పేర్కొంది. గత దశాబ్ద కాలంలో ప్రభుత్వ రంగ మూలధన పెట్టుబడి పెరిగిందని తెలిపింది. ఆర్థిక రంగం పదిలంగా ఉందని, ఆహారేతర రుణ వృద్ధి బలంగా ఉందని, ఇవన్నీ దేశ ఆర్థిక పటిష్ఠతను తెలియజేస్తున్నాయని పేర్కొంది. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు తీసుకొచ్చిన సంస్కరణలు బ్యాంకులు, కార్పొరేట్ సంస్థల బ్యాలెన్స్ షీట్లను మెరుగుపరిచాయని ప్రస్తావించింది. జీఎస్టీ విధానాన్ని పాటించడంతో దేశీయ మార్కెట్ల ఏకీకరణ సాధ్యపడిందని, ఆర్థిక సామర్థ్యాన్ని పెంపొందించిందని నివేదిక పేర్కొంది.