Railway news: తర్వాతి స్టేషన్‌లో ట్రైన్ ఎక్కి నా సీటు ఏది? అంటే ఇక కుదరదు!
- టీటీఈలు కొంతకాలంగా ఉపయోగిస్తున్న హ్యాండ్ హెల్డ్ టెర్మినల్స్‌తో చెక్
- ఎక్కాల్సిన స్టేషన్‌లో రైలు ఎక్కకపోతే టికెట్ మరొకరికి కేటాయించే అవకాశం
- బోర్డింగ్ వివరాలు మార్చుకోకుంటే సీటు ఏదని అడిగే హక్కు ఉండదంటున్న రైల్వే అధికారులు
రిజర్వేషన్ చేయించుకొని ఎక్కాల్సిన స్టేషన్‌లో ఎక్కకుండా తదుపరి స్టేషన్‌లో రైలు ఎక్కి ‘నా సీటు ఏది’ అంటే ఇకపై కుదరదు. గతంలో టీటీఈలకు ప్రింటెడ్ రిజర్వేషన్ లిస్టును అందించేవారు. దీంతో ఒకటి, రెండు స్టేషన్ల వరకు ప్రయాణికులు రాకపోయినా వారు వేచి చూసేవారు. కానీ ఇప్పుడు అందుకు అవకాశం లేదు. అయితే టీటీఈలు (ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్) కొంత కాలంగా ట్యాబ్స్ మాదిరిగా ఉండే హ్యాండ్ హెల్డ్ టెర్మినల్స్ ద్వారా ఎప్పటికప్పుడు రైలులో రిజర్వేషన్ వివరాలను పరిశీలిస్తున్నారు. ఆ పరికరాల్లో ఎప్పటికప్పుడు వివరాలు అప్‌లోడ్ అవుతుంటాయి.
ఓ స్టేషన్‌లో ఎక్కేందుకు రిజర్వేషన్ చేసుకున్నవారు రైలు ఎక్కకపోతే తర్వాత స్టేషన్ వచ్చేలోపు ఆర్‌ఏసీ, వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులకు ఆ బెర్త్‌లు కేటాయించే అవకాశం ఉంటుంది. దీంతో తర్వాత స్టేషన్‌లో రైలు ఎక్కి నా బెర్త్ ఏదీ? అని ప్రశ్నించేందుకు ప్రయాణికులకు హక్కు ఉండదు. అయితే తర్వాతి స్టేషన్‌లో రైలు ఎక్కాలనుకుంటే అందుకు సంబంధించిన బోర్డింగ్ వివరాలను మార్చుకోవాల్సి ఉంటుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.