Iran: ఇరాన్‌లో 9 మంది పాకిస్థానీల కాల్చివేత.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత

9 Pakistani labourers shot dead in Iran

  • ఇంట్లోకి చొరబడి మరీ కాల్చి చంపిన గుర్తు తెలియని దుండగులు
  • మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
  • చర్చల కోసం ఇరాన్ మంత్రి పాక్‌లో పర్యటనకు ఒకరోజు ముందు ఘటన
  • విధ్వంసకర శక్తుల పనేనన్న ఇరాన్

పాకిస్థాన్‌కు చెందిన 9 మంది కార్మికులు ఇరాన్‌లో దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. పాకిస్థాన్‌తో సరిహద్దు పంచుకుంటున్న ఇరాన్‌లోని సిస్తాన్-బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో శనివారం గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి వీరిని కాల్చి చంపారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై పాకిస్థాన్ తీవ్రంగా స్పందించింది. దీనిపై వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని, ఈ దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని పాక్ విదేశాంగశాఖ డిమాండ్ చేసింది. ఈ ఘటనకు ఏ గ్రూపు ఇప్పటి వరకు బాధ్యత ప్రకటించలేదు.

ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ చర్చల కోసం పాకిస్థాన్‌లో పర్యటించడానికి ఒకరోజు ముందు ఈ ఘటన జరగడం గమనార్హం. ఇరు దేశాల మధ్య సోదర సంబంధాన్ని దెబ్బతీసేందుకు విధ్వంసకర శక్తులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించబోవని ఇరాన్ స్పష్టం చేసింది.

ఇరాన్ దాడులతో ఉద్రిక్తత మొదలు
బలూచిస్థాన్ ప్రావిన్సులోని జైషే మహ్మద్, అల్ అదిల్ ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న ఇరాన్ ఈ నెల 16న క్షిపణి దాడులకు దిగింది. ఇది పాక్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలకు కారణమైంది. ఇరాన్ దాడిలో ఇద్దరు చిన్నారులు మరణించారని పేర్కొన్న పాకిస్థాన్.. 18న ఇరాన్‌లోని సిస్తాన్-బలూచిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో 9 మంది మరణించారు. ఈ ఘటనలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ తాజా ఘటన మరింత అగ్గిరాజేసింది.

More Telugu News