Rohit Sharma: రోహిత్ శర్మ కెప్టెన్సీపై దినేశ్ కార్తీక్ విమర్శలు.. హైదరాబాద్ టెస్టులో ఓటమిపై స్పందన

Dinesh Karthik criticise Rohit Sharmas captaincy Reacted on defeat in the Hyderabad Test aganist England

  • టీమిండియా రక్షణాత్మకంగా ఆడడంపై విమర్శలు గుప్పించిన క్రికెటర్
  • ఇంగ్లండ్ టెయిల్ ఎండర్లపై స్పిన్నర్లు అశ్విన్, జడేజా ఒత్తిడి పెంచలేదని వ్యాఖ్య
  • ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన మాజీ దిగ్గజం రవిశాస్త్రి

హైదరాబాద్ టెస్టులో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఓటమిపై దినేశ్ కార్తీక్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీ వ్యూహాలపై విమర్శలు గుప్పించాడు. ఆట నాలుగవ రోజున టీమిండియా రక్షణాత్మకంగా ఆడడాన్ని తప్పుబట్టాడు. మొదటి రోజుతో పోల్చితే నాలుగవ రోజు భారత్ చాలా రక్షణాత్మకంగా ఆడిందని అన్నాడు. ‘‘క్రీజులో పాతుకుపోయి 196 పరుగులు చేసిన ఇంగ్లిష్ బ్యాటర్ ఒల్లీ పోప్‌ విషయంలో సంప్రదాయ వ్యూహాలను అనుసరించారంటే ఫర్వాలేదు. కానీ టాప్ ఆర్డర్ బ్యాటర్ టామ్ హర్ట్లీ విషయంలోనూ ఇదే విధంగా ఆడారు. రవీంద్ర జడేజా, అశ్విన్‌లు ఎటాకింగ్ బౌలింగ్ చేయాల్సింది. టెయిల్ ఎండర్స్‌పై భారత బౌలర్లు ఒత్తిడి పెంచాల్సింది’’ అని దినేశ్ కార్తీక్ అన్నాడు. ఈ మేరకు ‘జియో సినిమా’తో మాట్లాడాడు.

భారత క్రికెట్ దిగ్గజం రవిశాస్త్రి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పర్యాటక జట్టు మూడవ ఇన్నింగ్స్‌లో 400 కంటే ఎక్కువ పరుగులు చేస్తే ఎలా ఎదుర్కోవాలన్న అనుభవం రోహిత్ శర్మ బృందానికి లేదని వ్యాఖ్యానించారు. ‘‘మైదానంలో ఆటగాళ్ల బాడీ మారిపోయింది. ఇలాంటి పరిస్థితిపై భారత ఆటగాళ్లకు అవగాహన లేదు. ఆతిథ్య జట్టు ఒత్తిడిలో ఉందని పసిగట్టవచ్చు. మూడవ ఇన్నింగ్స్‌లో 400లకుపైగా పరుగులు చేసిన జట్లను ఎదుర్కొన్న అనుభవం లేదు’’ అని రవిశాస్త్రి అన్నారు. కాగా తొలి టెస్ట్ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఏకంగా 420 పరుగులు చేసింది. 196 పరుగులతో రాణించిన ఒల్లి పోప్ ఇంగ్లండ్‌ను పటిష్ఠ స్థితిలో నిలిపాడు. 231 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో భారత బ్యాటర్లు విఫలమయ్యారు. వెంటవెంటనే వికెట్లు కోల్పోయి 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

More Telugu News