Adilabad District: రెండు లీటర్ల నువ్వుల నూనెను క్షణాల్లో తాగేసిన ‘తొడసం’ ఆడపడుచు!
- ఆదిలాబాద్‌లోని ఉట్నూరు ఏజెన్సీలో ప్రారంభమైన నార్నూర్ కామ్‌దేవ్ జాతర
- తొడసం వంశీయుల పూజలతో ప్రారంభం
- వరుసగా రెండోసారి నూనె తాగిన మేస్రం నాగుబాయి చందు
- నూనె తాగడం వల్ల మేలు జరుగుతుందని విశ్వాసం
అవును! నీళ్లు కాదు.. రెండు లీటర్ల నువ్వుల నూనెను ఓ మహిళ క్షణాల్లో తాగేసింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఏజెన్సీలోని నార్నూర్ కామ్‌దేవ్ జాతరలో గత రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివాసీ గిరిజనులు ఘనంగా జరుపుకొనే ఈ జాతర తొడసం వంశీయుల పూజలతో ప్రారంభమైంది. ఇందులో భాగంగా తొడసం వంశీయురాలైన ఆడపడుచు మేస్రం నాగుబాయి చందు (52) రెండు లీటర్ల నువ్వుల నూనెను గటగటా తాగేశారు.
జాతరలో ఇలా నువ్వుల నూనె తాగడం ఆచారంగా వస్తోంది. ఆడపడుచు హోదాలో ముందుకొచ్చే మహిళ వరుసగా మూడేళ్లపాటు ఈ జాతరలో నువ్వుల నూనె తాగాల్సి ఉంటుంది. మహారాష్ట్రలోని జవితా తాలూకా కొద్దెపూర్ గ్రామానికి చెందిన చందు నూనె తాగడం వరుసగా ఇది రెండోసారి. ఇలా నూనె తాగడం వల్ల మంచి జరుగుతుందని తొడసం వంశీయులు విశ్వసిస్తారు.