Tanmay Agarwal: రంజీల్లో హైదరాబాద్ ఓపెనర్ తన్మయ్ సంచలనం.. 147 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ
- ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ట్రిపుల్ సెంచరీగా రికార్డు
- విండీస్ క్రికెట్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ రికార్డు సహా మరికొందరి రికార్డులు బద్దలు
- 39 ఏళ్ల క్రితం రవిశాస్త్రి సాధించిన అత్యంత వేగవంతమైన రికార్డును కూడా తుడిచిపెట్టేసిన తన్మయ్
అరుణాచల్ ప్రదేశ్‌తో హైదరాబాద్‌లో ప్రారంభమైన రంజీట్రోఫీ ప్లేట్ డివిజన్ మ్యాచ్‌లో హైదరాబాదీ ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. కేవలం 147 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ సాధించి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇందులో 33 ఫోర్లు, 21 సిక్సర్లు ఉన్నాయి. తన్మయ్ వీర బాదుడుతో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 48 ఓవర్లలో వికెట్ నష్టానికి 529 పరుగుల భారీ స్కోరు సాధించింది. హైదరాబాద్ కెప్టెన్ రాహుల్ సింగ్ 105 బంతుల్లో 185 పరుగులు చేశాడు. మొత్తంగా 160 బంతులు ఎదుర్కొన్న తన్మయ్ అగర్వాల్ 323 పరుగులు సాధించి క్రీజులో ఉన్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రికార్డుగా నమోదైంది.
2017-18లో దక్షిణాఫ్రికాకు చెందిన మార్కో మరియస్ 191 బంతుల్లో త్రిశతకం సాధించాడు. న్యూజిలాండ్‌కు చెందిన కెన్ రూథర్‌ఫర్డ్ 234, విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ 244, శ్రీలంక క్రికెటర్ కుశాల్ పెరీరా 244 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించారు. తన్మయ్ ఇప్పుడా రికార్డులన్నింటినీ బద్దలుగొట్టాడు. అంతేకాదు, ఇదే మ్యాచ్‌లో భారత క్రికెట్‌లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ సాధించిన (119 బంతుల్లో) ఆటగాడిగానూ తన్మయ్ రికార్డులకెక్కాడు. 39 సంవత్సరాల క్రితం రవిశాస్త్రి (123 బంతుల్లో) నమోదు చేసిన రికార్డు కూడా తుడిచిపెట్టుకుపోయింది.