Chiranjeevi: కలిసి మురిసిన పద్మవిభూషణులు!

M   Venkaiah naidu and megastar Chiranjeevi meets and wished each other as they got Padmavibhushan

  • వెంకయ్యనాయుడు మా ఉద్యమనేత: చిరంజీవి
  • తెలుగు పరిశ్రమకు త్రినేత్రుడు: వెంకయ్యనాయుడు
  • పరస్పరం అభినందించుకున్న పద్మవిభూషణులు

ఒకే ప్రాంతానికి చెందిన ఇద్దరు ప్రముఖులకు పద్మవిభూషణ్‌ లభించటం చాలా అరుదు. వారిద్దరు స్నేహితులు కావటం.. సమాజాభివృద్ధి కోసం పనిచేసినవారు కావటం ఇంకా అరుదు. అలాంటి సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పద్మవిభూషణ్‌ పురస్కార గ్రహీతలు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్‌ చిరంజీవిలు శుక్రవారం సాయంత్రం కలుసుకున్నారు. ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. ‘‘ జైఆంధ్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో నేను కాలేజీలో చదువుతున్నా. ఆ సమయంలో వెంకయ్యనాయుడు గారు విద్యార్థి ఉద్యమనేత. ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మేము కాలేజీలు బహిష్కరించి ఉద్యమంలో పాల్గొన్నాం. నాకు ఆయన ఆ రోజు నుంచి తెలుసు’’ అని చిరంజీవి తన కాలేజీ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 

ఆ తర్వాత  తాను సినిమాలలోకి వచ్చానని.. ఆయన రాజకీయాల్లో ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదిగారని మెగాస్టార్‌ పేర్కొన్నారు. ‘‘ కొద్దికాలం తర్వాత మేమిద్దరం పార్లమెంట్‌లో కొలిగ్స్‌గా ఉన్నాం. అనేక విషయాలు ఆయనను అడిగి తెలుసుకొనేవాడిని. సమాచారం విషయంలో ఆయన నాకు స్ఫూర్తి. వెంకయ్యనాయుడు గారు స్వయంకృషితో ఎదిగిన వ్యక్తి. ఆయనను చూసి అందరూ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. వెంకయ్యనాయుడు గారితో పాటుగా నాకు కూడా పద్మవిభూషణ్‌ రావటంతో నా ఆనందం ద్విగుణీకృతమయింది. ఇద్దరు తెలుగువాళ్లం.. స్నేహితులం. మాకు ఒకేసారి ఒకే అవార్డు రావటం థ్రిల్లింగ్‌ అనిపించింది. మేమిద్దరం కలుసుకొని జ్ఞాపకాలు నెమరువేసుకున్నాం’’ అని చిరంజీవి అన్నారు. 

మూడో కన్ను..
తెలుగు సినీ రంగానికి ఎన్టీఆర్‌, ఏఎన్నాఆర్‌ రెండు కళ్లు అయితే– చిరంజీవి మూడో కన్ను అని వెంకయ్యనాయుడు అభినందించారు. ఈ అవార్డు రావటానికి అన్ని అర్ఞతలు మీకు ఉన్నాయి. మీరు కష్టపడి ఒక్కో అడుగు వేసుకుంటూ - ఎవరూ ఊహించని ఎత్తుకు ఎదిగారు’’ అని వెంకయ్యనాయుడు ప్రశంసించారు. సరైన సమయంలో ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకుందని వ్యాఖ్యానించారు. ‘ సో ప్రౌడ్‌ ఆఫ్‌ యూ’ అని మెగాస్టార్‌ను ప్రశంసించి సత్కరించారు.

  • Loading...

More Telugu News