- ఎల్లుండి అమిత్ షా వస్తున్నారన్న సంజయ్
- కరీంనగర్ లో కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొంటారని వెల్లడి
- నియోజకవర్గంలో 20 రోజులు యాత్ర చేస్తానన్న సంజయ్
లోక్ సభ ఎన్నికల శంఖారావాన్ని కరీంనగర్ నుంచి పూరించబోతున్నామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తెలిపారు. ఈ నెల 28న కరీంనగర్ లోని ఎస్సారార్ కాలేజీ గ్రౌండ్ లో 10 నుంచి 20 వేల మంది బీజేపీ కార్యకర్తలతో సమ్మేళనం నిర్వహించబోతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొంటారని తెలిపారు.
ఎల్లుండి తెలంగాణకు అమిత్ షా వస్తున్నారని... మూడు క్లస్టర్ మీటింగుల్లో ఆయన పాల్గొంటారని సంజయ్ చెప్పారు. వీటితో పాటు చారిత్రక కట్టడాలను సందర్శిస్తారని తెలిపారు. 28న ఉదయం పాలమూరులో క్లస్టర్ మీటింగ్ లో పాల్గొంటారని.. మధ్యాహ్నం ఒంటి గంటకు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొంటారని చెప్పారు. ఇక్కడి నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తామని తెలిపారు.
కరీంనగర్ లోక్ సభ స్థానంలో గెలుపు కోసం పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నామని సంజయ్ చెప్పారు. ఫిబ్రవరి 5 నుంచి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో యాత్రను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. గ్రామాల్లో పాదయాత్ర చేస్తానని... సమయం తక్కువగా ఉండటం వల్ల ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లేటప్పుడు వాహనంలో వెళ్తానని చెప్పారు. 20 రోజుల పాటు తన యాత్ర కొనసాగుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న కార్యక్రమాలను ఇంటింటికీ వివరిస్తానని చెప్పారు.