Emmanuel Macron: గణతంత్ర దినోత్సవం..భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్ అధ్యక్షుడి గుడ్ న్యూస్
- 2030 కల్లా ఫ్రెంచ్ యూనివర్సిటీల్లో 30 వేల భారత విద్యార్థులను చేర్చుకుంటామని వెల్లడి
- గతంలో ఫ్రాన్స్‌లో చదువుకున్న వారికి త్వరిత గతిన వీసాలు వచ్చే ఏర్పాటు చేస్తామని ప్రకటన
- తమ దేశ యూనివర్సిటీల్లో ఇంటర్నేషనల్ క్లాసులూ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడి
భారత గణతంత్ర దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొంటున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మేక్రాన్ భారతీయ విద్యార్థులకు తాజాగా గుడ్‌న్యూస్ చెప్పారు. 2030 నాటికి ఫ్రాన్స్ యూనివర్సిటీల్లో 30 వేల మంది భారతీయ విద్యార్థులను చేర్చుకోవడమే తమ లక్ష్యమని వెల్లడించారు. ఈ గొప్ప లక్ష్యాన్ని చేరుకునేందుకు తాను పట్టుదలతో ఉన్నట్టు తెలిపారు. ఇరు దేశాల మధ్య విద్యాపరమైన బంధం దృఢపరిచేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
‘ఫ్రెంచ్ ఫర్ ఆల్, ఫ్రెంచ్ ఫర్ బెటర్ ఫ్యూచర్’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఫ్రెంచ్ భాష నేర్చుకునేందుకు కొత్త మార్గాలు ప్రారంభిస్తున్నట్టు మేక్రాన్ తెలిపారు. ఈ దిశగా ఫ్రెంచ్ నేర్పించే కేంద్రాలతో ఓ నెట్వర్క్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఫ్రెంచ్ రాని అంతర్జాతీయ విద్యార్థులకు అనుకూలంగా తమ దేశ యూనివర్సిటీల్లో అంతర్జాతీయ క్లాసులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. గతంలో ఫ్రాన్స్‌లో చదువుకున్న భారతీయులకు త్వరితగతిన వీసా లభించే విధానాన్ని ప్రవేశపెడతామన్నారు.