Pawan Kalyan: ముఖ్యమంత్రి... మతాన్ని స్వార్థం కోసం ఉపయోగించుకునే వ్యక్తి: పవన్ కల్యాణ్

Pawan Kalyan slammed CM uses religion for self
  • పవన్ ను కలిసిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా క్రైస్తవ మతపెద్దలు
  • మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశం
  • ముఖ్యమంత్రి జీసస్ వాక్యాలను పాటించే వ్యక్తి కాదన్న పవన్
  • జీసస్ వాక్యాలను పాటిస్తే ఇలా ప్రవర్తించడని వ్యాఖ్యలు
ఇవాళ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా క్రైస్తవ మతపెద్దలు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను కలిశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. 

ముఖ్యమంత్రి జీసస్ వాక్యాలను పాటించే వ్యక్తి కాదని, ఆయన జీసస్ వాక్యాలను పాటిస్తే రాష్ట్రాన్ని ఇలా ఇబ్బందులకు గురిచేసేవాడు కాదని అన్నారు. ముఖ్యమంత్రి... మతాన్ని తన స్వార్థం కోసం వాడుకునే వ్యక్తి అని విమర్శించారు. మానవత్వంతో నిలబడే వ్యక్తికి మతం ఉండదని, తన మతాన్ని ప్రేమిస్తూ, ఇతర మతాలను గౌరవించేవారే ప్రజలకు న్యాయం చేయగలుగుతారని పవన్ పేర్కొన్నారు. తాను జగన్ లాగా మాటలు చెప్పనని స్పష్టం చేశారు. 

జగన్ హయాంలో 517 దేవాలయాలు అపవిత్రం అయ్యాయని అన్నారు. అందుకు సంబంధించిన దోషులను పట్టుకోకపోతే పాలకుడు అన్య మతస్తుల పక్షం వహిస్తున్నారనే భావన హిందువుల్లో కలుగుతుందని చెప్పారు. 

జగన్ అనే వ్యక్తి సీఎం అయ్యాక క్రైస్తవ సమాజం ఇలాంటి పనులకు పాల్పడుతోందన్న భావన అంతర్గతంగా పెరిగిపోతోందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి అని, ఇలాంటి రుగ్మతలను పూర్తిగా నిర్మూలించాలన్న లక్ష్యంతోనే తాను మాట్లాడతానని, ఈ అంశాన్ని తాను ఏసు క్రీస్తు నుంచి అలవర్చుకున్నానని చెప్పారు.
Pawan Kalyan
Jagan
Religion
Christians
Janasena
YSRCP
Andhra Pradesh

More Telugu News