Botsa Satyanarayana: మరో 70 రోజుల్లో ఎవరేంటో తేలిపోతుంది: మంత్రి బొత్స
- విపక్షాలపై మంత్రి బొత్స విసుర్లు
- తాము మూడు రాజధానులకు మద్దతు ఇస్తున్నట్టు వెల్లడి
- బీజేపీ అమరావతికి జై కొడుతోందని విమర్శలు
- నారా లోకేశ్ ఖాళీగా ఉంటూ ట్వీట్లు పెడుతుంటాడని వ్యాఖ్యలు
- ఎవరు ప్యాకప్పో, ఎవరు మేకప్పో ప్రజలే సమాధానం చెబుతారన్న బొత్స
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులకు మద్దతు ఇస్తుంటే, బీజేపీ అమరావతికి జై కొడుతోందని అన్నారు. విపక్షాలు అధికారం కోసమే రాజకీయాలు చేస్తున్నాయని, వైసీపీ ప్రభుత్వానికి మాత్రం ప్రజాసంక్షేమమే పరమావధి అని బొత్స స్పష్టం చేశారు.
నాడు ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని తాకట్టు పెట్టింది టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబేనని అన్నారు. ప్రజలకు అన్నీ తెలుసని... మరో 70 రోజుల్లో ఎవరేంటో తేలిపోతుందని పేర్కొన్నారు.
నారా లోకేశ్ ఖాళీగా ఉంటూ ట్వీట్లు పెడుతుంటాడని, ఎవరు ప్యాకప్పో, ఎవరు మేకప్పో ప్రజలే సమాధానం చెబుతారని బొత్స వివరించారు. పాదయాత్ర చేసిన లోకేశ్ శ్రీకాకుళం వరకు రాకుండానే ప్యాకప్ అయిపోయాడని ఎద్దేవా చేశారు.