Sasikala: జయలలిత నివాసం ఎదురుగా శశికళ కొత్త ఇల్లు... లాంఛనంగా గృహప్రవేశం
- జయలలితకు అత్యంత సన్నిహితురాలిగా శశికళకు గుర్తింపు
- దాదాపు 30 ఏళ్లు జయతో వేద నిలయం నివాసంలో ఉన్న శశికళ
- జయ మరణానంతరం ప్రాభవం కోల్పోయిన 'చిన్నమ్మ'
తమిళనాడు రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత సన్నిహితురాలిగా, ఆమె ఆత్మగా మెలిగిన శశికళ తన కొత్త ఇంట్లో అడుగుపెట్టారు. చెన్నైలోని పొయెస్ గార్డెన్ ప్రాంతంలో జయలలిత ఇంటి ఎదురుగానే శశికళ కొత్త ఇంటిని నిర్మించుకున్నారు. నిన్న పూజా కార్యక్రమాలు నిర్వహించి, లాంఛనంగా నూతన గృహ ప్రవేశం చేశారు. ఈ కార్యక్రమానికి శశికళ బంధువులు హాజరయ్యారు.
పొయెస్ గార్డెన్ లోని వేద నిలయం నివాసంలో జయలలితకు తోడుగా శశికళ దాదాపు 30 ఏళ్లు ఉన్నారు. 'చిన్నమ్మ'గా గుర్తింపు పొందారు. ఈ మూడు దశాబ్దాల కాలంలో అన్నాడీఎంకేలో శశికళ మాట వేదవాక్కులా చెలామణీ అయింది.
2016లో జయ మరణానంతరం శశికళను పట్టించుకున్నవారే లేరు. దానికితోడు అక్రమార్జన కేసులో నాలుగేళ్లు జైలులో గడిపిన శశికళ.... జైలు నుంచి విడుదలైనప్పటికీ సాధారణ వ్యక్తిలానే మిగిలిపోయారు. దానికితోడు అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురికావడంతో రాజకీయాల్లో ఆమె పాత్ర ఏ రూపంలోనూ లేకుండా పోయింది.