Ravi Shastri: తన కెరీర్‌లో మరుపురాని బెస్ట్ మూమెంట్‌ను చెప్పిన క్రికెట్ దిగ్గజం రవిశాస్త్రి

Cricket legend Ravi Shastri on his favorite moment of his career

  • క్రికెటర్‌గా ఎన్నో మరపురాని జ్ఞాపకాలు ఉన్నాయన్న టీమిండియా దిగ్గజం
  • గబ్బా టెస్టులో టీమిండియా గెలుపు.. ఆ మ్యాచ్‌లో రిషబ్ పంత్ ఇన్నింగ్స్ ఎప్పటికీ మరచిపోలేనని వెల్లడి
  • బీసీసీఐ ‘లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డు’ ప్రదానం కార్యక్రమంలో రవిశాస్త్రి భావోద్వేగం

టీమిండియా క్రికెట్ దిగ్గజంగా, వ్యాఖ్యాతగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రవి శాస్త్రి బీసీసీఐ ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’ అందుకున్నారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన వేడుకలో అవార్డును ఆయన స్వీకరించారు. 40 ఏళ్లకు పైగా క్రికెట్‌తో ప్రయాణాన్ని కొనసాగిస్తున్న రవి శాస్త్రికి మైదానంలో, వెలుపల ఎన్నో మరపురాని జ్ఞాపకాలు ఉన్నాయి. మంగళవారం అవార్డు అందుకుంటున్న సమయంలో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. అయితే ఏదైనా ఒక రోజు ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే గుర్తుచేసుకుంటే ఆనందం కలిగించే సందర్భం ఏదైనా ఉందా? అని యాంకర్ హర్షా భోగ్లే ప్రశ్నించగా రవి శాస్త్రి ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.

బీసీసీఐ అవార్డుల కార్యక్రమంలో ప్రదర్శించిన కొన్ని క్లిప్పింగ్‌లు చూసిన తర్వాత రవిశాస్త్రి స్పందించారు. తన సుదీర్ఘ కెరీర్‌లో మరుపురాని క్షణాలు చాలానే ఉన్నాయని, అందులో ఒక దాన్ని బెస్ట్ మూమెంట్‌గా ఎంచుకోవడం కష్టమని అన్నారు. 

‘‘ 1985లో మెల్‌బోర్న్‌లో పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్ ప్రత్యేకమైనది. 1983లో భారత్ ప్రపంచ కప్ గెలిచినప్పుడు లార్డ్స్‌ మైదానంలో బాల్కనీలో ఉన్నాను. వెస్టిండీస్‌లో సెంచరీ, ఆస్ట్రేలియాలో డబుల్ సెంచరీ... ఇవన్నీ ఎప్పటికీ గుర్తిండిపోయే క్షణాలే" అని పేర్కొన్నారు.

ఇక రిటైర్మెంట్ తర్వాత వ్యాఖ్యతగా, కోచ్‌గా పనిచేసిన సమయంలో కెరీర్‌లో సంతోషాన్ని ఇచ్చిన క్షణాలు చాలానే ఉన్నాయని ఆయన చెప్పారు.  2011లో ఎంఎస్ ధోనీ సిక్స్ కొట్టి వరల్డ్ కప్ గెలిపించడం, 2007లో టీ20 ప్రపంచకప్ విజయం, ఆస్ట్రేలియాలో వరుసగా రెండు టెస్ట్ సిరీస్  విజయాలు ఇలా చాలా ఉన్నాయి. ఇందులో ఏది బెస్ట్ మూమెంట్ అని అడిగితే ‘గబ్బా టెస్టు’లో ఆస్ట్రేలియాపై రిషబ్ పంత్ చెలరేగి ఆడడంతో భారత్ గెలిచిన రోజు అని రవి శాస్త్రి వివరించారు. అందుకు ఆటగాళ్లకు ధన్యవాదాలని అన్నారు. 

ఎళ్లవేళలా తనకు అండగా నిలిచిన బీసీసీఐకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ‘‘ఇది నా మనస్సును హత్తుకునే క్షణం. ఎందుకంటే నేను 17 సంవత్సరాల వయస్సులో క్రికెట్‌ మొదలుపెట్టాను. 30 సంవత్సరాల వయస్సులో రిటైర్ అయ్యాను. బీసీసీఐ నాకొక సంరక్షకురాలిగా ఉంది. ఆడేందుకు నాకు మార్గం చూపించింది. దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణం. ఈ 40 ఏళ్లలో బీసీసీఐ ఎదగడం, ప్రపంచ క్రికెట్‌కు పవర్‌హౌస్‌గా మారడం నేను చూశాను. ఇది నాకు చాలా ప్రత్యేకమైన సందర్భం’’ అని శాస్త్రి అన్నారు.

More Telugu News