Ram Lalla: అయోధ్య బాలరాముడి విగ్రహం 'కృష్ణ శిల' వయస్సు 250 కోట్ల సంవత్సరాలు.. వివరాలు ఇవిగో
- నల్ల రాయి వయస్సు 2.5 బిలియన్ సంవత్సరాలు
- భూమి వయస్సు 4.5 బిలియన్ సంవత్సరాలుగా ఉంటుందని అంచనా
- మైసూర్ జిల్లా జయపుర హోబ్లీ గ్రామం నుంచి వచ్చిన నల్లరాయి
అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సోమవారం నాడు వైభవంగా జరిగింది. ప్రాణప్రతిష్ఠ తర్వాత రామ్ లల్లా దివ్యరూపాన్ని చూసిన భక్తులు మంత్రముగ్ధులయ్యారు. నల్లరాతితో లేదా కృష్ణ శిలతో చెక్కిన 51 అంగుళాల బాలరాముడి విగ్రహం అందరినీ ఆకట్టుకుంది. అయితే ఈ కృష్ణ శిలకు చరిత్ర ఉంది. ఈ ప్రత్యేక కృష్ణశిలను కర్ణాటకలోని మైసూరు నుంచి తెప్పించారు. ఈ రాయి 2.5 బిలియన్ (250 కోట్ల) సంవత్సరాల క్రితం నాటిదని పరీక్షలలో తేలిందని బెంగళూరులోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రాక్స్ మెకానిక్స్ డైరెక్టర్ హెచ్ఎస్ వెంకటేశ్ తెలిపారు. భారతీయ ఆనకట్టలు, అణు విద్యుత్ ప్లాంట్ల కోసం రాళ్లను పరీక్షించడానికి ఏర్పడిన నోడల్ ఏజెన్సీయే నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రాక్స్ మెకానిక్స్.
బాలరాముడి విగ్రహం కోసం వినియోగించిన రాయి చాలా మన్నికైనదని వెంకటేశ్ తెలిపారు. ఈ ఉప ఉష్ణ మండలంలో వాతావరణ వైవిధ్య నిరోధకతను కలిగి ఉన్న పురాతనమైన రాయి అని తెలిపారు.
జయపుర హోబ్లీ గ్రామం నుంచి వచ్చిన రాయి
నాణ్యమైన గ్రానైట్ గనులకు ప్రసిద్ధి చెందిన మైసూర్ జిల్లాలోని జయపుర హోబ్లీ గ్రామం నుంచి ఈ రాయిని తీసుకు వచ్చారు. ఈ శిల కేంబ్రియన్ పూర్వ యుగానికి చెందినదిగా గుర్తించారు. భూమి దాదాపు 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఉద్భవించిందని అంచనా. ఇప్పుడు రామ్ లల్లా విగ్రహం కోసం ఉపయోగించిన నల్ల గ్రానైట్ రాయి భూమి వయస్సులో దాదాపు సగం లేదా ఇంకా అంతకంటే ఎక్కువ వయస్సే ఉంటుందని అంచనా. అంటే, ఈ కృష్ణ శిల వయస్సు దాదాపు 2.5 బిలియన్ సంవత్సరాలు.
విగ్రహం చెక్కడానికి ఆరు నెలల సమయం
రామ్ లల్లా విగ్రహాన్ని మైసూరుకు చెందిన 38 ఏళ్ల అరుణ్ యోగి రాజ్ చెక్కారు. ఈ విగ్రహాన్ని రూపొందించడానికి ఆయనకు ఆరు నెలల సమయం పట్టింది. ఆయన చెక్కిన మరో ప్రసిద్ధ కళాఖండాలలో ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఉన్న 30 అడుగుల నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఒకటి.